జయలలిత కన్నుమూత

12 Dec, 2016 14:50 IST|Sakshi
 
తమిళనాడు ముఖ్యమంత్రి పురచ్చితలైవి జె.జయలలిత (68) కన్నుమూశారు. సోమవారం రాత్రి 11:30 గంటలకు ఆమె మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత, అప్పటి నుంచి సోమవారం వరకు ఆమె ఆరోగ్యం పలు రకాలుగా మారుతూ వచ్చింది. ఒక సమయంలో పూర్తి అచేతనంగా మారిన జయలలిత, మధ్యలో లేచి కూర్చున్నారని, అన్నం తిన్నారని, కాలర్ మైకు సాయంతో కొద్దిసేపు మాట్లాడారని కూడా చెప్పారు. ఇక ఆమె ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంటికి పంపేస్తామని కూడా తెలిపారు. అయితే, ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో ఒక్కసారిగా అన్నివర్గాల్లో మళ్లీ తీవ్ర ఆందోళన నెలకొంది. సోమవారం ఉదయం కూడా జయలలితకు గుండె ఆపరేషన్ చేసి, వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 
 
1948 ఫిబ్రవరి 24వ తేదీన నాటి మైసూరు రాష్ట్రంలోని మేలుకోటే ప్రాంతంలో జయరాం, వేదవల్లి దంపతులకు జయలలిత జన్మించారు. ఆమె అసలుపేరు కోమలవల్లి. తర్వాత స్కూల్లో రెండో తరగతిలో చేర్చినప్పుడు జయలలిత అనే పేరు నమోదు చేశారు. కుటుంబ పరిస్థితుల కారణంగా తన తల్లి బలవంతంతో 15వ యేట సినిమా రంగంలో ప్రవేశించారు. ఆమె నటించిన తొలి సినిమా చిన్నడ గొంబె (కన్నడ) పెద్ద హిట్టయ్యింది. తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను సినీరంగంలో పెద్దస్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వం జయలలితను కళైమామణి పురస్కారంతో సత్కరించింది. 
 
1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించిన జయలలిత.. రాచమంద్రన్ మరణానంతరం పెద్దస్థాయికి ఎదిగారు. 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా నిలిచారు. 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడుకు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె రికార్డు సాధించారు. ఐదేళ్లు పూర్తి పదవీకాలంలో ఉన్నా.. 2006 మేలో జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం చవిచూశారు. ఆమె పార్టికి కేవలం నాలుగు స్థానాలే దక్కాయి. తర్వాత మళ్లీ ఫీనిక్స్ పక్షిలా తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మధ్యలో ఒకసారి అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫలితంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన అనుంగు అనుచరుడు పన్నీరుసెల్వంకు పదవి అప్పజెప్పినా, మళ్లీ సుప్రీంకోర్టు ఊరటనివ్వడంతో పదవి చేపట్టారు.