ఆన్‌లైన్‌ క్లాస్‌లు వద్దు.. ఓకే!

28 May, 2020 09:01 IST|Sakshi

మంత్రి వ్యాఖ్యల విస్మయం

స్కూళ్ల నిర్ణయం సీఎం చేతిలోనే

ఆగస్టులో తెరిచే అవకాశం? 

సాక్షి, చెన్నై: ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ గురించి ఒకే రోజు విద్యా మంత్రి సెంగోట్టయన్‌ చేసిన రెండు రకాల వ్యాఖ్యలు సర్వత్రా విస్మయంలో పడేశాయి. ఉదయాన్నే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి, సాయంత్రం అనుమతులు ఇస్తున్నామని ప్రకటించడం గమనార్హం.

లాక్‌డౌన్‌ సడలింపుల ప్రక్రియ సాగుతున్నా, ఇప్పట్లో విద్యా సంస్థలు తెరచుకునే అవకాశాలు లేవు. దీంతో ఆయా విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ తరగతులపై దృష్టి పెట్టాయి. జూన్‌ నుంచి ప్రైవేటు విద్యా సంస్థలు మెజారిటీ శాతం ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభం, విద్యా వ్యవహారాల పర్యవేక్షణకు ఓ ఉన్నత స్థాయి కమిటీని సీఎం పళనిస్వామి రంగంలోకి దించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక మేరకు స్కూళ్ల రీ ఓపెనింగ్‌ ఆగస్టులో ఉండ వచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ సమాచారంతో ప్రైవేటు సీబీఎస్‌ఈ, మెట్రిక్యులేషన్‌ యాజమాన్యాలు ఆన్‌లైన్‌ తరగతులు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్‌లు పంపించే పనిలో పడ్డాయి. (వారిద్దరూ అమ్మ వారసులే)

మాట మార్చేశారు.. 
జూన్‌ ఒకటి నుంచి ఈ తరగతుల నిర్వహణ వేగం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం విద్యా మంత్రి సెంగోట్టయన్‌ మీడియాతో మాట్లాడుతూ ఆన్‌లైన్‌ తరగతులపై ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులు అంటూ వేధింపులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు కల్గించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరికలు చేశారు. అయితే, సాయంత్రానికి మాట మార్చేశారు. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. (విమానం ఎక్కుతానని ఎప్పుడూ అనుకోలేదు )

అయితే, ఉపాధ్యాయుల్ని స్కూళ్లకు రప్పించడం, అక్కడి నుంచి తరగతులు నిర్వహించే రీతిలో చర్యలు తీసుకుంటే చర్యలు తప్పదన్న హెచ్చరిక చేశామని దాట వేశారు. ఉన్న చోట నుంచే ఆన్‌లైన్‌లో తరగతుల్ని నిర్వహించుకోవచ్చని, ఇందుకు ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు విధించలేదన్నారు. పాఠశాలలను తెరిచే విషయంగా ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, అన్ని సమీక్షల మేరకు సీఎం పళనిస్వామి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.  

ఉన్న చోటే పరీక్షలు.. 
పదో తరగతి విద్యార్థులకు ఊరట కల్గించే ఉత్తర్వులు వెలువడ్డాయి. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జూన్‌ 15 నుంచి జరగనున్న విషయం తెలిసిందే. కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాల ఏర్పాటు సాగుతున్నాయి. అలాగే, అనేక మంది విద్యార్థులు పరీక్షలు ఓ చోట రాయాల్సి ఉండగా, వారు మరో చోట నివాసం ఉండడం, మరో ప్రాంతానికి వెళ్లి ఉండడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం తాజాగా ఓ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నారో, అక్క డి పరీక్షా కేంద్రంలోనే పరీక్షలు రాసుకోవచ్చని కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించింది. ఇక, పదీ పరీక్షలు రాయనున్న విద్యార్థుల్ని మానసికంగా సిద్ధం చేయడానికి తగ్గట్టు వారికి ప్రత్యేకంగా కథల్ని వినిపించే రీతిలో సరికొత్త యాప్‌లు తెరపైకి రావడం విశేషం. 

మరిన్ని వార్తలు