క్షమాపణ చెప్పిన గవర్నర్‌

18 Apr, 2018 14:25 IST|Sakshi
తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ (పాత చిత్రం)

చెన్నై : విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్ట్‌ పట్ల తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్ ప్రవర్తించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు ఆయన క్షమాపణలు చెప్పారు. మనువరాలి వయస్సులో ఉన్న ఆమెను అభినందించేందుకే ఆమె చెంపను తాకానన్నారు. తన చర్య వల్ల ఆ మహిళా జర్నలిస్టు బాధపడినందు వల్ల ఆమెకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. దయచేసి తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని  గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌కోరారు.

అసలేం జరిగిందంటే..
బన్వరిలాల్‌తో తనకు పరిచయం ఉందంటూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్‌ మంగళవారం రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తనకు ఆ ప్రొఫెసర్‌ ఎవరో కూడా తెలియదంటూ బన్వరిలాల్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బదులుగా సమాధానం చెప్పకుండా బదులుగా ఆమె చెంపను తాకారు. గవర్నర్‌ చర్యతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. తన పట్ల గవర్నర్‌ ప్రవర్తనపై మహిళా జర్నలిస్టు ట్విటర్‌లో స్పందించారు.

‘విలేకరుల సమావేశంలో భాగంగా తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ను ప్రశ్న అడిగాను. అందుకు బదులుగా ఆయన నా చెంపను తాకారు’  అంటూ మహిళా జర్నలిస్లు లక్ష్మీ సుబ్రహ్మణినయన్‌ ట్వీట్‌ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇలా ప్రవర్తించడం సబబు కాదన్నారు. ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం మంచి పద్థతి కాదన్నారు. నా ముఖాన్ని పదేపదే శుభ్రం చేసుకున్నాను. కానీ ఆ మలినం నన్ను వదిలినట్లు అనిపించడం లేదు. 78 ఏళ్ల వయస్సున్న మీరు నాకు తాతయ్యలాంటి వారే కావొచ్చు. కానీ మీ చర్య నాకు తప్పుగా అన్పిస్తోంది’  అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు