నాగ్‌పూర్‌ నుంచి తమిళనాడు.. హైదరాబాద్‌లో మృతి

3 Apr, 2020 09:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా సంచార సదుపాయం లేక ఇతర ప్రాంతాలకు  వలస వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొంత గ్రామాలకు తిరిగి వెళ్లెందుకు వాహనాలు లేకపోవడంత నడుచుకుంటూ రోడ్డుబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది వలస కూలీలు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా ఇ‍ప్పటికే వెలుగుచూశాయి. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ యువకుడు మహారాష్ట్రలోని నాగపూర్‌ నుంచి కాలిబాటన బయలుదేరి హైదరాబాద్‌లో మృత్యుఒడికి చేరాడు.

స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడుకు చెందిన లోగేష్‌ బాల సుబ్రహ్మణ్యం ఉపాధి నిమిత్తం నాగపూర్‌కు వలస వెళ్లాడు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ అతని జీవితంలో కల్లోలం సృష్టించింది. లాక్‌డౌన్‌ విధించడంతో పనిలేక, తింటానికి తిండిలేని పరిస్థితి. దీంతో అక్కడ ఉండలేక పొట్టచేతపట్టుకుని కాలిబాటన తన స్వగ్రామం తమిళనాడులోని నమక్కళ్‌కు బయలుదేరాడు. మూడు రోజుల పాటు సుమారు 500 కిలోమీటర్లు నడిచిన అనంతరం సికింద్రాబాద్‌ చేరుకునే సమయంలో తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు.

లోగేష్‌ను గమనించిన స్థానికులు అధికారులకు సమచారం ఇవ్వడంతో ఓ షెల్టర్‌ హోంకు తరలించారు. ఈ క్రమంలోనే గరువారం రాత్రి చికిత్స పొందుతూ అతను కన్నుమూశాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. వేసవి కాలంలో ఎక్కువ దూరం నడవడం మూలంగా డీహైడ్రేషన్‌తో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. మృతదేహాన్ని స్వస్థలానికి పంపించే ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు