వింత కోరిక విని పరుగు లంకించుకున్నారు.. కానీ,

2 Mar, 2020 17:34 IST|Sakshi
వధూవరులు శివగురు ప్రభాకరన్‌, కృష్ణభారతి

టీ.నగర్‌: పుట్టిన గడ్డపై మమకారంతో ఆ ప్రాంత ప్రజల వైద్య అవసరాలు తీర్చేందుకు ఓ సబ్‌ కలెక్టర్‌ వింత వరకట్నం కోరారు. వివరాలు.. తంజావూరు జిల్లా, ఒట్టంగాడు గ్రామానికి చెందిన శివగురు ప్రభాకరన్‌ అనేక కష్టాలతో ఐఏఎస్‌ అధికారి స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం తిరునెల్వేలిలో సబ్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు అమ్మాయి కోసం అన్వేషించారు. ఇతన్ని వివాహమాడేందుకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌ చదివిన యువతులు సిద్ధపడినా తాను ఒక వైద్యురాలినే వివాహమాడతానని తెలిపాడు. తల్లిదండ్రులు మెడికల్‌ కోర్స్‌ చేసిన యువతి కోసం ఏడాదిగా వెదికారు.

మెడిసిన్‌ చేసిన యువతులు లభించినా, ఇతను కోరిన వింత వరకట్నం విని పరుగు లంకించుకున్నారు. చెన్నై నందనం కళాశాల గణిత అధ్యాపకురాలి కుమార్తె డాక్టర్‌ కృష్ణభారతిని చూశారు. డాక్టర్‌ కృష్ణభారతికి వరుని నూతన నిబంధనను సంశయంతో వెల్లడించారు సబ్‌ కలెక్టర్‌ తల్లిదండ్రులు. తమ కుమారుడు పెళ్లాడే డాక్టర్‌ వారంలో రెండు రోజులు ఒట్టంగాడు గ్రామ ప్రజలకు, పరిసరప్రాంతాల వారికి ఉచితంగా వైద్య సేవలందించాలన్నదే అతని వరకట్నం కోరికని వెల్లడించారు. దీన్ని కృష్ణభారతి సంతోషంగా స్వీకరించడంతో ఫిబ్రవరి 26న ఇద్దరికీ వివాహం జరిగింది. ఈ కాలంలోను ఇటువంటి వ్యక్తా అంటూ ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ పట్ల ఉన్న ప్రేమానురాగాలతో పొంగిపోయిన పేరావూరణి ప్రజలు జంటను ప్రశంసించారు.

మరిన్ని వార్తలు