భయపడి గోవును తిరిగిచ్చేసిన ఎంపీ!

25 Jul, 2018 16:37 IST|Sakshi
ఎస్పీ నేత అజాం ఖాన్ (ఫైల్‌ ఫొటో)

రామ్‌పూర్ : రోజురోజుకు మూకదాడులు.. హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ముస్లిం నేతలు ఆవులను పెంచుకునేందుకు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అజాంఖాన్ భార్య, రాజ్యసభ సభ్యురాలు తంజీమ్‌ ఫాతిమా తన ఇంట్లో ఆవుపై అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల తనకు ఓ సాధువు నుంచి కానుకగా వచ్చిన ఆవును తిరిగిచ్చేశారు. ఇటీవల రాజస్థాన్‌లోని అల్వార్‌లో ముస్లిం యువకుడు రగ్బర్‌ ఖాన్‌ను కొట్టి చంపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

‘గోవధ విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు దేశంలో మూకదాడులు పెరిగిపోతున్నాయి. మాకు చాలా బాధగా ఉంది. అందుకే ఇటీవల ఓ సాధువు ఎంతో ప్రేమతో మాకు కానుకగా ఇచ్చిన గోవును గోశాలకే తిరిగి ఇచ్చేస్తున్నాం. మేం ముస్లింలం అయిన కారణంగా ఎవరైనా ఆ గోవును చంపేసి మా కుటుంబంపై నింద మోపుతారన్న భయంతోనే ఈ పని చేయాల్సి వచ్చిందని’  తంజీమ్‌ ఫాతిమా వివరించారు. గోశాలలకు రూ.25లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. 

ఎన్డీఏ హాయాంలోనే మైనార్టీలపై దారుణాలు జరుగుతున్నాయని, ముస్లింలకు రక్షణ కరువైందని విమర్శించారు. గోశాలలకు ముస్లింలు దూరంగా ఉండాలని, ముస్లింలు ఆవులను పెంచుకోవద్దని, పాల వ్యాపారం లాంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమమని అజాంఖాన్‌ పిలుపునిచ్చారు. మనం ఆవులను తాకితే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు