ప్రేమే గెలిచింది..!

18 Nov, 2016 22:44 IST|Sakshi
ప్రేమే గెలిచింది..!

శుభం కార్డులు పడేది సినిమాలకే.. జీవితాలకు కాదు. మూడు గంటల పాటు ఏదేదో చూపించి చివరగా ఓ హ్యాపీ ఎండింగ్‌ ఇవ్వడం సినిమాలకే సాధ్యమయ్యే విషయం. నిజజీవితంలో ఇలాంటి హ్యాపీ ఎండింగ్‌లు ఆశించడం కాస్త కష్టమే! కానీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన తాపేశ్వర్‌ జీవితానికి మాత్రం సినిమా తరహా శుభం కార్డే పడింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది నెలల వెతుకులాటకు చక్కని ముగింపు దొరికింది. ఆ కథేంటో మీరూ తెలుసుకోండి..!

నాలుగేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని ధర్మశాలలో తొలిసారిగా బబితను కలిశాడు తాపేశ్వర్‌. అప్పటికే ఆమె పిచ్చిచూపులు చూస్తోంది. ఎవరో ఏంటో కనుక్కుందామని ప్రయత్నించాడు. మాట కలిపాడు. మాటల్లో భాగంగా అర్థమైంది అతడికి.. ఆమె గతమేంటో.. భవిష్యత్తేంటో..! బబిత మొదట్నుంచీ మానసిక రోగి. ఆరోగ్యస్థితి సరిగా లేకపోవడంతో పిచ్చిపనులు చేస్తూ కుటుంబానికి భారంగా తయారైంది. ఆ భారాన్ని వదిలించుకోవడానికే ఆమె కుటుంబ సభ్యులు ధర్మశాలలో వదిలేసి వెళ్లిపోయారు.

ముప్పై ఆరేళ్ల తాపేశ్వర్‌ మరేం ఆలోచించలేదు. బబితను వెంటబెట్టుకుని తన స్వస్థలమైన మీరట్‌కు చేరుకున్నాడు. ఆమెను వివాహం చేసుకుని, ఇద్దరూ సరికొత్త జీవితం మొదలుపెట్టారు. ఈ ఏడాది మార్చి వరకూ వరకూ అంతా బాగానే ఉంది. కానీ, ఉన్నట్టుండి బబిత మాయమవ్వడంతో తాపేశ్వర్‌ కష్టాలు మొదలయ్యాయి. భార్య కోసం ఊరంతా గాలించాడు. ఎక్కడా ఆమె జాడలేదు. పోస్టర్లు అతికించి, ఇంటింటికీ తిరిగి ఆమె ఆచూకీ అడిగాడు. అయినా, ప్రయోజనం లేదు. అప్పటినుంచి తాపేశ్వర్‌కు సరిగా నిద్రకూడా పట్టేది కాదు. మానసికంగా బలహీనమైన తన భార్య ఎలాంటి పరిస్థితుల్లో ఉందోనని కుమిలిపోయేవాడు. తన జీవనాధారమైన కూలిపనిని కూడా వదిలిపెట్టి, భార్య కోసం సైకిల్‌పై వెదుకులాట మొదలుపెట్టాడు.


అలా దాదాపు ఎనిమిది నెలల పాటు సైకిల్‌పై తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడికక్కడ అతికించిన పోస్టర్ల ఆధారంగా భార్య ఆచూకీ దొరుకుతుందనేది ఆయన ఆశ. కొన్నాళ్లకు బంధువుల్లో కొందరు బబితను చూశామన్నారు. ఆమెను కొందరు బలవంతంగా వేశ్యాగృహాలకు అమ్మేశారని చెప్పారు. దాంతో రెడ్‌లైట్‌ ఏరియాల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఎక్కడా ఆమె ఆనవాళ్లు కనిపించలేదు. పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయించాడు. చివరకు ఓ రోజు హరిద్వార్‌ నుంచి ఓ ఫోన్‌ అందుకున్నాడు. బబితను గుర్తుపట్టిన ఓ వ్యక్తి, ఆమె భిక్షమెత్తుకుంటోందని తాపేశ్వర్‌కు సమాచారమిచ్చాడు. రెక్కలు కట్టుకుమరీ వాలిపోయిన ఆయన.. తన భార్య దుస్థితికి కుమిలిపోయాడు. అక్కున దగ్గరకు తీసుకుని గుండెల నిండా హత్తుకున్నాడు. ఆశ చంపుకోకుండా.. పట్టు విడువకుండా తాపేశ్వర్‌ చేసిన ప్రయత్నం వారి ప్రేమను గెలిపించింది. చివరకు ప్రేమే గెలిచింది!!

మరిన్ని వార్తలు