'గ్లోబల్ టాప్ ఎంప్లాయర్' గా టీసీఎస్...

29 Feb, 2016 20:19 IST|Sakshi
'గ్లోబల్ టాప్ ఎంప్లాయర్' గా టీసీఎస్...

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రపంచ వ్యాప్త గుర్తింపును తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 1,072 సంస్థల్లో టాప్ ఎంప్లాయర్స్ ఇనిస్టిట్యూట్ గా పేరొందిన టీసీఎస్ 'గ్లోబల్ టాప్ ఎంప్లాయర్' అవార్డును అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది ఇతర సంస్థలతో సహా శ్రామిక ప్రణాళిక, ఆన్ బోర్డింగ్, అభ్యాసం మరియు అభివృద్ధి, పనితీరు నిర్వహణ, నాయకత్వ అభివృద్ధి వంటి విషయాల్లో అగ్రభాగాన నిలిచింది. ప్రపంచంలోని ఉత్తమ యాజమాన్యాలకు ప్రదానం చేసే ఈ గౌరవ అవార్డును ఇప్పుడు టీసీఎస్ సాధించింది.  ఉద్యోగులు, వినియోగదారుల విషయంలో అత్యున్నత ప్రమాణాలను పాటించే తమ యాజమాన్యం ఈ పురస్కారాన్ని అందుకుంటోందని సంస్థ తెలిపింది.  

ఈ జాబితాలో సీజేఎస్సీ టెక్నిప్, డీహెచ్ ఎల్, డైమెన్షన్ డేటా, సెయింట్ గోబెయిన్, జేటీ ఇంటర్నేషనల్, మొబినిల్, మోబిస్టార్, ఆరెంజ్, వాలియో సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ నిరంతరం ముందు చూపుతో ఆలోచిస్తూ తమ ఉద్యోగుల పరిస్థితులు, అభివృద్ధికి మార్గంగా నిలుస్తున్నాయని టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ గ్లోబల్ హెడ్ అజయ్ ముఖర్జీ  తెలిపారు. ఇది తమ సంస్థకు మంచి విజయమని, దీని స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగులు,  వినియోగదారుల సేవల్లో మరింత అభివృద్ధికి మార్గమౌతుందని సంస్థ చెప్తోంది.

>
మరిన్ని వార్తలు