పెళ్లయిన 4 నెలలకే ప్రసవం.. టీచర్‌పై వేటు!

19 Jun, 2019 14:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం: ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ మహిళ పెళ్లయిన నాలుగు నెలలకే ప్రసవించి.. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసూతి సెలవులనంతరం బడిలో తిరిగి చేరేందుకు ప్రయత్నించగా.. అందుకు ఆ ప్రభుత్వ పాఠశాల నిరాకరించింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన కేరళలోని కొట్టక్కల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. 

ప్రసూతి సెలవుల అనంతరంలో మళ్లీ విధుల్లో చేరుందుకు బడికి వెళ్లిన తనను పెరెంట్స్‌-టీచర్స్‌ అసోసియేషన్‌ సమావేశంలో తీవ్రంగా దూషించారని, అంతేకాకుండా తిరిగి విధుల్లో చేరేందుకు అనుమతించలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొట్టక్కల్‌ పోలీసుల ఆమె ఫిర్యాదును స్వీకరించి.. దర్యాప్తు జరుపుతున్నారు. 

ఇక్కడి ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూల్‌లో ఐదేళ్లుగా టీచర్‌గా పనిచేస్తున్నట్టు బాధితురాలు(35) తన ఫిర్యాదులో తెలిపారు. మొదటి భర్తతో ఇబ్బందుల కారణంగా ఆమె విడాకులు తీసుకున్నారు. అనంతరం రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే, మొదటి భర్త నుంచి వేరయినా.. విడాకుల ప్రక్రియ ఆలస్యం కావడంతో ఆమె రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తితో సహజీవనం చేయడం ప్రారంభించారు. చట్టబద్ధంగా విడాకులు వచ్చిన తర్వాత 2018లో సహజీవనం చేస్తున్న వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో పెళ్లయ్యే నాటికే గర్భవతిగా ఉన్న ఆమె పెళ్లయిన నాలుగు నెలలకు బిడ్డను ప్రసవించారు. అయితే, ప్రసూతి సెలవులు ముగిసిన అనంతరం గత జనవరిలో పాఠశాలలో తిరిగి చేరేందుకు ప్రయత్నించగా.. అధికారులు అందుకు అంగీకరించలేదు. దీంతో తన ఉద్యోగం కోసం ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు