ప్లీజ్‌... అలా చేయొద్దని టీచర్‌కి చెప్పండి

22 Sep, 2017 11:41 IST|Sakshi
ప్లీజ్‌... అలా చేయొద్దని టీచర్‌కి చెప్పండి
సాక్షి, యూపీ : వరుసగా స్కూళ్లలో జరుగుతున్న ఉదంతాలు పిల్లల తల్లిదండ్రులను కలవర పెడుతున్న వేళ ఉత్తర ప్రదేశ్‌లో ఓ బాలుడి ఆత్మహత్య సంచలనంగా మారింది. శిక్షల పేరిట టీచర్లు కఠినంగా హింసిస్తున్నారంటూ ఐదో తరగతి చదువుతున్న ఆ బాలుడు లేఖ రాసి తనువు చాలించాడు. 
 
గోరఖ్‌పూర్‌ సెయింట్‌ ఆంటోనీ కాన్వెంట్‌ స్కూల్‌ లో చదువుతున్న 11 ఏళ్ల నవనీత్‌ ప్రకాశ్‌ను ఈ నెల 15న టీచర్‌ క్లాస్‌ రూంలో దండించింది. దీంతో మనస్థాపం చెందిన ఆ బాలుడి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్‌ నుంచి ఇంటికొచ్చిన నవనీత్‌ నోటి నుంచి నురగలు రావటం గమనించిన తల్లిదండ్రులు హుటాహుటినా బీఆర్డీ ఆస్పత్రికి తరలించగా, ఆ లోపే బాలుడు మృతి చెందాడు. 
 
అతని స్కూల్‌ బ్యాగ్‌లో సూసైడ్‌ నోట్‌ లభ్యం కాగా.. అందులో... ‘నాన్న, ఇవాళ మొదటి ఎగ్జామ్‌. టీచర్‌ నన్ను మూడు పీరియడ్లపాటు నిలిచోపెట్టారు. నేను చెప్పేది ఆమె అస్సలు పట్టించుకోలేదు. ఆమెకు అనుకూలంగా ఉండేవారి మాటే ఆమె వింటారు. అమ్మా. నాన్న.. నన్ను క్షమించండి. నేను చనిపోతున్నా. మరే విద్యార్థిని కూడా ఇలా దండించవద్దని మా టీచర్‌కి దయచేసి చెప్పండి’ అంటూ రాసి ఉంది.
 
తన కొడుకు మరణానికి స్కూల్‌ యాజమాన్యానిదే బాధ్యతని నవనీత్‌ తండ్రి ఆరోపిస్తున్నాడు. ఆత్మహత్య ప్రేరపణ నేరం కింద కేసు నమోదు చేసిన షాపూర్‌ పోలీసులు టీచర్‌ భావనను అరెస్ట్ చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
>
మరిన్ని వార్తలు