ప్రజాప్రతినిధులకు పీఏలుగా టీచర్లా?

14 Jul, 2016 01:12 IST|Sakshi
ప్రజాప్రతినిధులకు పీఏలుగా టీచర్లా?

- ఇదేం పద్ధతి: సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు
- టీచర్లు పీఏలు, పీఎస్‌లుగా ఉండరాదు
- వారి డిప్యుటేషన్లు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం
- పోస్టుల భర్తీకి, జీరో స్కూళ్లలో ప్రవేశాలకు ఏం చేస్తున్నారు?
- నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలన్న ధర్మాసనం
 
 సాక్షి, న్యూఢిల్లీ : ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు వ్యక్తిగత సిబ్బందిగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పని చేయడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఇందుకు వీలు కల్పిస్తున్న డిప్యుటేషన్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లోపంపై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. ప్రభుత్వోపాధ్యాయులు డిప్యుటేషన్లపై బోధనేతర విధులు నిర్వర్తిస్తున్నారని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల వద్ద పీఏలు, పీఎస్‌లుగా పని చేస్తున్నారని తెలంగాణ తల్లిదండ్రుల సమాఖ్య తరపు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, ‘ఇదేం పద్ధతి? ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో కొనసాగడమేంటి?’ అని జస్టిస్ మిశ్రా తీవ్రంగా ప్రశ్నిం చారు. అలాంటి విధుల్లో ఉన్నవారిని గుర్తించి వెనక్కి రప్పించామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది విశ్వనాథ్ శెట్టి ఇచ్చిన సమాధానంతో శ్రవణ్‌కుమార్ విభేదించారు. దాంతో, అలాంటి డిప్యుటేషన్లను రద్దు చేయాలని జస్టిస్ మిశ్రా ఆదేశించారు. అంతేగాక, ‘‘విద్యార్థులే లేని (జీరో ప్రవేశాలున్న) స్కూళ్లలో పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఏం చర్యలు చేపడుతున్నారు.. పర్యవేక్షక పోస్టులు, టీచర్ పోస్టుల భర్తీకి ఏం చర్యలు తీసుకున్నారు.. వీటిపై 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయండి’’ అని కూడా ఆదేశించారు.

 నివేదికతో ఏకీభవించబోం
 కోర్టు నియమించిన అమికస్ క్యూరీ అశోక్ కుమార్ గుప్తా తెలంగాణలో పర్యటించి, క్షేత్రస్థాయి పరిస్థితుల ను అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను కోర్టు కు అందించారు. వివరాలను చదివి వినిపించారు. ‘‘తల్లిదండ్రులు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చది వించాలని ఆశించడమే గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల లు మూతపడేందుకు కారణం. చిన్నారులను మూడేళ్లకే ఎల్‌కేజీలో చేర్పించాలని ఆశిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ల లో అందుకు అవకాశం లేదు. చిన్న ఆవాసాల్లో తగిన సంఖ్యలో విద్యార్థుల్లేక స్కూళ్లు మూతపడుతున్నాయి. తల్లిదండ్రులు సాయంత్రం దాకా కూలికి వెళ్తారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలు త్వరగా ఇంటికొస్తారు. వారిని చూసుకునేందుకు ఎవరూ ఉండరనే కారణంతో కూడా ప్రైవేటు వైపు మొగ్గుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో పని చేసేందుకు ప్రభుత్వోపాధ్యాయులూ సుముఖంగా ఉండట్లేదు. వాటికి కనీసం రవాణా సౌకర్యముండదు’’ అని విన్నవించారు.

ఈ నివేదికతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘ఈ నివేదిక పట్టణ ప్రాంతాలను ఆధారంగా చేసుకుని రూపొందించినట్టుగా ఉంది. దీంతో మేం పూర్తిగా ఏకీభవించబోము’ అని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వ వైఖరేమిటని ప్రశ్నించారు. పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేస్తామని, బయోమెట్రిక్ హాజరు విధానాన్ని విడతలవారీగా అమలు చేస్తామని విశ్వనాథ్ శెట్టి వివరించారు. దీనిపైనా జస్టిస్ మిశ్రా అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ‘‘ప్రైవేట్ విద్యా వ్యయాన్ని అందరూ మోయలేరు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలి. పటిష్టమైన విధానం రూపొందించాలి’’ అని నిర్దేశించారు.

 పర్యవేక్షణ కొరవడింది
 సుప్రీంకోర్టు జోక్యం తర్వాతే తెలంగాణలో విద్యావ్యవస్థలో మార్పులొచ్చాయని శ్రవణ్‌కుమార్ వివరించారు. ‘‘మూతపడిన వాటిలో 271 స్కూళ్లను తెరిచారు. వీటిలో 140 ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు. అయితే తెలంగాణలో విద్యపై పర్యవేక్షణ లేదు. ఆ పని చేయాల్సిన ఎంఈవో, డిప్యూటీ డీఈవోలు, డీఈవో పోస్టులు 90 శాతం ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయ పోస్టులూ ఖాళీగా ఉన్నాయి’’ అన్నారు. టీచర్ల సర్వీసు నిబంధనల ఇబ్బందులే ఇందుకు కారణమని, సమస్యను పరిష్కరిస్తామని శెట్టి నివేదించారు. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించగా ఆయన సరిగా స్పందించలేదు. 2005 నుంచీ ఈ సమస్య ఇలాగే ఉందని శ్రవణ్‌కుమార్ చెప్పారు. తగిన పర్యవేక్షణ లేకుంటే పిల్లలకు సరైన విద్య అందదని జస్టిస్ మిశ్రా ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధాన కార్యదర్శి కాకుండా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అఫిడవిట్ సమర్పిస్తారని శెట్టి చెప్పగా... ‘మీకెందుకు సిగ్గు? చేసింది చెప్పండి. ఇద్దరూ ప్రభుత్వ అధికారులేగా! సీఎస్‌నే దాఖలు చేయాలని చెప్పండి’ అని ఆదేశించారు. ఉపాధ్యాయ నియామకాల బాధ్యతలను టీఎస్‌పీఎస్సీకి అప్పగించామని, ఈ ప్రక్రియ అమలుకు సంస్థకు సమయం అవసరమని శెట్టి వివరించారు. సంబంధిత ప్రక్రియను కొనసాగించాలని సూచిస్తూ విచారణ ను సెప్టెంబరు 7కు జస్టిస్ మిశ్రా వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు