రూ. 3.85 కోట్ల నిధులు స్వాహా?

2 Dec, 2016 12:32 IST|Sakshi
ఆ నిధులను తీస్తా సెతల్వాద్ నొక్కేశారా?
స్వచ్ఛంద సంస్థలకు వచ్చే నిధుల్లో ఎన్ని నిజంగా బాధితులకు ఉపయోగపడతాయో, ఎన్ని వాళ్ల జేబుల్లోకి వెళ్తాయో చెప్పలేం. ఇప్పడు గుజరాత్ పోలీసులు కూడా ఇలాంటిదే ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. 2002 నాటి గుజరాత్ అల్లర్ల బాధితులను ఆదుకోడానికి వివిధ మార్గాల నుంచి తన స్వచ్ఛంద సంస్థకు వచ్చిన రూ. 9.75 కోట్ల నిధుల్లో.. రూ. 3.85 కోట్లను ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త కలిసి పక్కదోవ పట్టించారని పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ మేరకు కోర్టుకు 83 పేజీల అఫిడవిట్‌ సమర్పించారు. గుల్బర్గ్ సొసైటీకి చెందిన అల్లర్ల బాధితుల కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేయడానికి తాము ప్రయత్నించినా.. సెతల్వాత్, ఆమె భర్త జావేద్ ఆనంద్, వాళ్ల ట్రస్టులు సెంటర్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ (సీజేపీ), సబ్‌రంగ్ ఏమాత్రం సహకరించలేదని ఆ అఫిడవిట్‌లో ఏసీపీ రాహుల్ బి పటేల్ తెలిపారు. 
 
సెతల్వాద్ దంపతులు పెట్టుకున్న ముందస్తు బెయిల్ దరఖాస్తును గుజరాత్ హైకోర్టు తిరస్కరించగా, సుప్రీంకోర్టు మాత్రం వాళ్లిద్దరినీ అరెస్టు చేయొద్దని పోలీసులకు తెలిపింది. అయితే, పోలీసులకు కావల్సిన పత్రాలు సమర్పించాలని వారిని ఆదేశించింది. తమ పరువుకు భంగం కలిగించడానికే గుజరాత్ పోలీసులు ఈ తరహా దర్యాప్తు చేస్తున్నారని తీస్తా సెతల్వాద్ జాతీయ మానవహక్కుల కమిషన్‌ను కూడా ఆశ్రయించారు. తాము సీజేపీ, సబ్‌రంగ్, సెతల్వాద్, ఆనంద్‌ల బ్యాంకు ఖాతాలను 2007 నుంచి 2014 వరకు పరిశీలించామని పోలీసులు సుప్రీంకు తెలిపారు. ఈ సమయంలో రెండు స్వచ్ఛంద సంస్థలకు కలిపి మొత్తం రూ. 9.75 కోట్ల స్వదేశీ, విదేశీ విరాణాలు వచ్చాయని, వాటిలోంచి ఈ దంపతులు తమ వ్యక్తిగత ఖర్చుల కోసం రూ. 3.85 కోట్లు ఉపయోగించారని అన్నారు. తమ వ్యక్తిగత ఖాతాలలో జావేద్ ఆనంద్ రూ. 96.43 లక్షలు, తీస్తా సెతల్వాద్ రూ. 1.53 కోట్లు డిపాజిట్ చేసుకున్నారని చెప్పారు. 
 
2011 ఫిబ్రవరి నుంచి 2012 జూలై నెల వరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఇచ్చిన రూ. 1.40 కోట్ల గ్రాంటు నుంచి కూడా కొంత సొమ్మును తమ వ్యక్తిగత అవసరాల కోసం ఈ దంపతులు ఉపయోగించుకున్నారని పోలీసులు ఆరోపించారు. తాము కొన్ని ఖాతాలను 2014 జనవరి 23న సీజ్ చేయగానే.. తమకు తెలియకుండా ఒకే రోజు డీడీల రూపంలో రూ. 24.5 లక్షలు, రూ. 11.5 లక్షలను సబ్‌రంగ్ ట్రస్టుకు చెందిన మరో ఖాతా నుంచి బదిలీ చేసుకున్నారని కూడా అఫిడవిట్‌లో తెలిపారు. అకౌంట్లను పోలీసులు సీజ్ చేసిన తర్వాత, సబ్‌రంగ్ ట్రస్ట్ జనరల్ అకౌంట్, సబ్‌రంగ్ ట్రస్ట్ హెచ్‌ఆర్‌డి అకౌంట్ పేరుతో మరో బ్యాంకులో ఖాతాలు తెరిచిన విషయాన్ని కూడా ఈ దంపతులు కోర్టుకు తెలియకుండా దాచారన్నారు. 2007 సంవత్సరానికి ముందు సీజేపీ, సబ్‌రంగ్ ట్రస్టుల ఖాతాల్లో చాలా చిన్న మొత్తాలు మాత్రమే ఉండేవని, బాధితులను ఆదుకోడానికి, వారికి పునరావాసం కల్పించడానికి అత్యవసరంగా తమకు నిధులు అవసరమని ఈ దంపతులు తమ వెబ్‌సైట్లు, ఇంటర్వ్యూలు, వార్తాపత్రికల ద్వారా భారీగా ప్రచారం చేసిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నిధులు వెల్లువెత్తాయని పోలీసులు ఆరోపించారు. అల్లర్ల బాధితుల్లో చాలామందికి ఉచితంగా న్యాయసహాయం అందించామంటూ సెతల్వాద్ చెబుతున్న విషయం కూడా అవాస్తవమని, లీగల్ ఫీజుల పేరుతో వివిధ న్యాయవాదులకు రూ. 71.40 లక్షలను చెల్లించినట్లు రికార్డులలో ఉందని అన్నారు. అందువల్ల సెతల్వాద్ దంపతులను విచారించడానికి వీలుగా వారిని తమ కస్టడీకి అప్పగించాలని సుప్రీంకోర్టును కోరారు. 
మరిన్ని వార్తలు