ఐశ్వర్యకే మద్దతు.. నా వాళ్లే కుట్రపన్నారు!

5 Nov, 2018 10:01 IST|Sakshi
తేజ్‌ ప్రతాప్‌- ఐశ్వర్యారాయ్‌ పెళ్లినాటి ఫొటో

పట్నా : ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పెళ్లయి ఆరు నెలలైనా గడవక ముందే భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఆధునిక భావాలున్న ఐశ్వర్యతో తనకు సఖ్యత లేదని.. పెళ్లి తర్వాత జీవితం చాలా కష్టంగా గడుస్తోందంటూ తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ విడాకుల దరఖాస్తులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య సయోధ్య కుదుర్చటానికి ప్రయత్నిస్తున్న తన కుటుంబ సభ్యులపై తేజ్‌ ప్రతాప్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. (వద్దన్నా.. ఆమెతో పెళ్లి చేశారు)

‘నేను రెండు నెలలుగా ఆమెతో మాట్లాడటం మానేశాను. తనతో కలిసి ఉండటం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పాను. అయినప్పటికీ ఆమె నా కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి ఏం చెబుతుందో తెలియదు కానీ వారు పూర్తిగా ఆమెకే మద్దతు తెలుపుతున్నారు. ఐశ్వర్యను సపోర్టు చేయడం వెనుక ఏదో పెద్ద కుట్రే దాగి ఉంది. ఇందులో నా కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రధాన సూత్రధారిగా ఉన్నారని అన్పిస్తోంది. నా వాళ్లే నాపై కుట్రపన్నడం బాధగా ఉందంటూ’ తేజ్‌ ప్రతాప్‌ ఆరోపించారు.

కాగా బిహార్‌ మాజీ సీఎం దరోగా రాయ్‌ మనుమరాలైన ఐశ్వర్యరాయ్‌తో మే 12వ తేదీన తేజ్‌ ప్రతాప్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ)లో మరోసారి ఆధిపత్య పోరు మొదలైనట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు, ఎమ్మెల్యే తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పార్టీని వీడనున్నారని.. అదే సమయంలో ఆయన భార్య ఐశ్వర్యరాయ్‌ రాజకీయ అరంగేట్రం చేస్తారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తేజ్‌ ప్రతాప్‌.. ఐశ్వర్యరాయ్‌ నుంచి విడాకులు కోరడం, కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు