విడాకులపై వెనక్కు తగ్గిన తేజ్‌ ప్రతాప్‌

29 Nov, 2018 17:13 IST|Sakshi

పట్నా : ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ కుమారుడు, బిహార్‌ మాజీ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు తన విడాకుల నిర్ణయానికి ఆమోదం తెలిపితేనే ఇంటికి వస్తానంటూ కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి పోయి షాక్‌ ఇచ్చిన తేజ్‌ ప్రతాప్‌.. తాజాగా తన విడాకుల పిటిషన్‌ని ఉపసంహరించుకున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి తేజ్‌ ప్రతాప్‌ నుంచి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రటన వెలువడలేదు. విడాకుల పిటిషన్ దాఖలు చేసిన తర్వాత తేజ్ ప్రతాప్ యాదవ్ తన మనసులోని బాధను తెలియజేసేలా .. ఓ కవితను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా 16వ శతాబ్దానికి చెందిన ఓ ప్రముఖ కవి రాసిన పంక్తులను ఆయన ప్రస్తావించారు. ‘ఒకసారి ప్రేమ ముక్కలైతే అది అతుక్కోదు. దాన్ని మళ్లీ కలపాలని ప్రయత్నించడం వృధా’ అనే భావం వచ్చేలా ఉన్న కవితను పోస్ట్ చేశారు. విడాకుల నిర్ణయం పట్ల ఎవరి మాటా విననంటూ తేల్చి చెప్పిన తేజ్‌ ప్రతాప్‌ ఇంత సడెన్‌గా తన నిర్ణయాన్ని మార్చుకోవడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే 2019 ఎన్నికల నేపథ్యంలోనే తేజ్‌ ప్రతాప్‌ తన విడాకుల విషయంలో వెనక్కు తగ్గినట్లు సమాచారం.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోడం కోసం ఆర్జేడీ ఇతర పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో తేజ్‌ ప్రతాప్‌ విడాకులు తీసుకుంటే సీట్ల సర్దుబాటు అంశంలో విబేధాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు సన్నిహితులు. కాగా ఈ ఏడాది మే 12న తేజ్‌ ప్రతాప్‌, ఐశ్వర్యా రాయ్‌ల వివాహం అత్యంత ఆర్భాటంగా జరిగిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు