సూపర్‌ 30కి మద్దతుగా తేజస్వీ యాదవ్‌

31 Jul, 2018 14:32 IST|Sakshi

పట్నా :  విద్యార్థుల ఫలితాల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు ఎదురుకొంటున్న ప్రముఖ మ్యాథ్స్‌ నిపుణుడు ఆనంద్‌ కుమార్‌కు పలువురు ప్రముఖులు బాసటగా నిలిచారు. తొలుత బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా, కుమార్‌కు మద్దతుగా నిలిచారు. ‘మూక దాడులు మరో రూపం దాల్చాయి. ఈ సారి బాధితుడు మన ‘సూపర్‌ 30’ హిరో కుమార్‌. నిజమైన మ్యాథ్స్‌ నిపుణుడైన కుమార్‌ ఎంతో మందికి రోల్‌ మోడల్‌గా నిలిచారు. అతని సేవలు బిహార్‌కు, భారత్‌కు గర్వకారణమ’ని శత్రుఘ్న సిన్హా కొనియాడారు.

తాజాగా బిహార్‌ ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్‌ కూడా ఈ ఆరోపణలను ఖండించారు. కుమార్‌ని సోమవారం అతని ఇంట్లో కలిసిన తేజస్వీ ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘కుమార్‌ సమాజంలోని వెనుకబడిన వర్గం నుంచి వచ్చారు. ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి అండగా నిలిచారు. వారి మెరుగైన భవిష్యత్‌ కోసం పాటుపడుతూ.. తాను కూడా మంచి పేరు సంపాదించుకున్నారు.  కానీ నియంతృత భావాలు కలిగిన ఓ వర్గం అతని పేరును చెడగొట్టేలా అసత్యాలను ప్రచారం చేస్తోంది. కుమార్‌కు గౌరవ సూచికగా.. బాలీవుడ్‌లో అతని బయోపిక్‌ తెరకెక్కుతోంద’ని పేర్కొన్నారు.

పట్నా కేంద్రంగా కుమార్‌ ‘సూపర్‌ 30’  కోచింగ్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఇనిస్టిట్యూట్‌లో ఎటువంటి లాభం ఆశించకుండా విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. 14 ఏళ్ల కిందట కుమార్‌ స్థాపించిన సూపర్‌ 30 2010లో తొలిసారిగా వార్తలో నిలిచింది. ఆ ఏడాది ఐఐటీ-జేఈఈలో కుమార్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన మొత్తం 30 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇది అంతర్జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది.

ఇటీవల కుమార్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది సూపర్‌ 30కి చెందిన 26 మంది ఐఐటీ-జేఈఈకి అర్హత సాధించినట్టు తెలిపారు. దీనిపై అభ్యంతరం తెలిపిన సూపర్‌ 30కి చెందిన ఓ విద్యార్థి కుమార్‌ తప్పడు ప్రచారం చేసుకున్నట్టు ఆరోపించాడు. సూపర్‌ 30కి చెందిన ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఎగ్జామ్‌లో అర్హత సాధించారని, ఇతర ఇనిస్టిట్యూట్‌లకు చెందిన వారిని కూడా కుమార్‌ ఆ జాబితాలో చేర్చాడని తెలిపాడు. కాగా కుమార్‌ జీవితం ఆధారంగా హృతిక్‌ రోషన్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు