అర్ధరాత్రి వేడెక్కిన బిహార్‌ రాజకీయాలు

27 Jul, 2017 07:30 IST|Sakshi
అర్ధరాత్రి వేడెక్కిన బిహార్‌ రాజకీయాలు

పట్నా :
బిహార్‌లో బుధవారం అర్ధ రాత్రి(గురువారం తెల్లవారుజామున) రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆర్జేడీతో తెగతెంపులు చేసుకున్న జేడీయూకు బీజేపీ మద్దతు పలికడం, నితీశ్‌కు తిరిగి సీఎం పదవి ఖాయం కావడం వెనువెంటనే జరిగాయి. అయితే ముందుగా గురువారం సాయంత్ర 5 గంటల ప్రాంతంలో నితీశ్‌ ప్రమాణ స్వీకారం ఉంటుందని వార్తలు వచ్చాయి. తర్వాత తిరిగి ఉదయం 10 గంటలకే ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందని రాజ్‌భవన్‌ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఈ హఠాత్పరిణామం ఆర్జేడీ నేతలకు మింగుడుపడలేదు. వెంటనే ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు తేజస్వి యాదవ్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌కు పయనమయ్యారు. గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠి ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ సీట్లున్న ఆర్జేడీని పక్కన పెట్టి తక్కువ సీట్లున్న జేడీయూను పిలవడమేంటని మండిపడ్డారు. బీహార్‌లో ప్రజాస్వామ్యం కూనీ అయిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

తమకు గురువారం ఉదయం 12 గంటలకు గవర్నర్‌తో అపాయింట్‌మెంట్‌ ఇచ్చి, ఆ తర్వాత వెంటనే ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకే ఎలా మారుస్తారని తేజస్వీ యాదవ్‌ నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఎమ్మెల్యేలు తమవైపే ఉన్నారని తేజస్వీ స్పష్టం చేశారు. బిహార్‌ గవర్నర్‌ భవన్‌ ఎదుట గురువారం తెల్లవారుజామున ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించారు. ఐదుగురు ఎమ్మెల్యేలతో కలిసి తేజస్వీ యాదవ్‌ గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠిని కలిశారు. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి తమకే అవకాశం ఇవ్వాలని కోరారు. బిహార్‌ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ఆర్జేడీ పిలుపునిచ్చింది.