ఢిల్లీలో ఘనంగా అవతరణ వేడుకలు

3 Jun, 2016 06:02 IST|Sakshi
ఢిల్లీలో ఘనంగా అవతరణ వేడుకలు

 ► ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్య మంత్రి మహమూద్‌ అలీ
 ► 13 దేశాల రాయబార కార్యాలయాల ప్రతినిధులు హాజరు


సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో గురువారం రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, రాపోలు ఆనంద భాస్కర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు ఎస్‌.వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్‌ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని.. ఇప్పుడు అభివృద్ధి పథంలో వేగంగా అడుగులు వేస్తోందని మహమూద్‌ అలీ  పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్‌.. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. మేనిఫెస్టోలో లేనప్పటికీ షాదీ ముబారక్‌ వంటి పథకాలను ప్రవేశపెట్టారన్నారు.

తెలంగాణ త్వరలోనే దేశంలో మొదటి స్థానంలో నిలుస్తుందని ఎంపీ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ఉద్యమ పార్టీగానే కాకుండా బంగారు తెలంగాణ సాధనలోనూ ఎంతో స్ఫూర్తితో ముందుకు వెళుతోందని చెప్పారు. గత 57 ఏళ్లలో ఏ సీఎం కూడా చేయనన్ని పనులను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రెండేళ్లలోనే చేసి చూపారని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు.వేడుకల్లో భాగంగా సాయంత్రం బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. 13 దేశాలకు చెందిన రాయబార కార్యాలయాల ప్రతినిధులు, ఢిల్లీలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో తెలంగాణ సాంస్కృతిక, కళా వైభవాలను చాటిచెప్పే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను... తెలంగాణలో పర్యాటక, ఐటీ తదితర రంగాలలో పెట్టుబడులకు గల ఆవకాశాలను వివరిస్తూ అధికారులు మరో ప్రజెంటేషన్‌ను అధికారులు ప్రదర్శించారు. గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన పథకాలపై ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు.

>
మరిన్ని వార్తలు