అటవీ విస్తీర్ణం పెరుగుదలలో..తెలంగాణకు తొమ్మిదో స్థానం

31 Dec, 2019 03:23 IST|Sakshi

తొలి స్థానంలో కర్ణాటక.. ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ను ఆవిష్కరించిన కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరుగుదల కనబరిచిన రాష్ట్రాల్లో తెలంగాణ తొమ్మిదో స్థానంలో నిలిచింది. తెలంగాణలో 163 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. 1,025 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరుగుదలతో కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. భారత అటవీ నివేదిక–2019లో (ఐఎస్‌ఎఫ్‌ఆర్‌) ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ 16వ ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ నివేదికను సోమవారం ఇక్కడ ఆవిష్కరించారు.

అటవీ విస్తీర్ణం పెరుగుదల కనిపించిన రాష్ట్రాల్లో కేరళ మూడో స్థానంలో నిలిచింది. కేరళలో 823 చదరపు కి.మీ. మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. దేశంలో అటవీ విస్తీర్ణం–వనరుల వినియోగంపై భారత అటవీ సర్వే (ఎఫ్‌ఎస్‌ఐ) రెండేళ్లకోసారి నివేదిక రూపొందిస్తుంది. దీని ప్రకారం గత రెండేళ్లలో దేశంలో 5,188 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. 2017, 2018 సంవత్సరాలకు సంబంధించిన డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.

ఖనిజ తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు: ప్రకాష్‌ జవదేకర్‌ 
నల్లమలలో యురేనియం నిక్షేపాల ఉనికిపై అధ్యయనం చేసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చామని ప్రకాష్‌ జవదేకర్‌ స్పష్టం చేశారు. ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సంబంధిత అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. యురేనియం సహా ఏ ఖనిజ తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు