-

చంద్రబాబుది చిలిపి చర్య: కేటీఆర్

19 Mar, 2016 04:22 IST|Sakshi
చంద్రబాబుది చిలిపి చర్య: కేటీఆర్

♦ ఏపీలో విపక్షానికి బదులు చెప్పలేకే సెక్షన్ 8 అంటున్నారని విమర్శ
♦ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ

 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ రాజకీయంగా ప్రతిపక్షానికి సమాధానం చెప్పలేక ‘సెక్షన్ 8’ అంటూ చిలిపి ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఇది ఏపీలో ప్రతిపక్షానికి రాజకీయంగా సమాధానం చెప్పే సత్తా లేక, అక్కడి ప్రజల ఆలోచనలను మళ్లించేందుకు బాబు చేస్తున్న చిలిపి ప్రయత్నమే తప్ప మరోటి కాదు. దానివల్ల అయ్యేదీ లేదు, పోయేదీ లేదు. ఈ విషయం లో వారు ఎంత తక్కువమాట్లాడితే అంత మంచిది’’ అన్నారు.

తన పర్యటనలో భాగంగా ఐటీమంత్రి రవిశంకర్ ప్రసాద్, పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీలను కలసినట్టు కేటీఆర్ వివరించారు. ‘‘రాష్ట్రానికి చెందిన పలు సమస్యలను వారికి వివరించాను. టీ హబ్‌కు సాయం చేయాలని రవిశంకర్‌ను అడిగాను. మొదటి దశ విజయవంతమైంది. రెండో దశకు రూ.100 కోట్లడిగాను. దాని ప్రారంభానికి ఆహ్వానించాం. ఐటీఐఆర్‌కు రూ.3వేల కోట్లడిగాను. ఐటీఐఆర్‌లో మార్పుచేర్పుల గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు రూ.50 కోట్లు సాయం చేయాలని కోరాం.

కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా చేయాలని వెంకయ్యను కోరాను. డబుల్ బెడ్రూం, ఇంటింటికి నల్లా పథకాలకు సాయం కోరాం. అమృత్, స్మార్ట్ సిటీ పథకాలను ఆయన వివరించారు. వెంకయ్యను మరోసారి వచ్చి కలుస్తా. అసెంబ్లీ స్థానాలను పెంచాలని, విభజన చట్టంలో పొందుపరిచినట్టుగా ఈ పార్లమెంటు సమావేశాల్లోనే సవరణ చేయాలని రాజ్‌నాథ్‌ను కోరాను. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు జైకా రుణం తీసుకున్నాం. కాల పరిమితి పూర్తయినందున దానికి సంబంధించి మిగిలిన రూ.833 కోట్లను వాడుకునేందుకు కేంద్రం అనుమతి లేఖ ఇవ్వాలని జైట్లీని కోరగా అంగీకరించారు’  అని కేటీఆర్ చెప్పారు.

మరిన్ని వార్తలు