భివండీలో తెలంగాణ ప్రజల వెతలు

26 Apr, 2020 02:28 IST|Sakshi

లాక్‌డౌన్‌తో నెలరోజులకు పైగా చిక్కుకుపోయాం

చిన్నపిల్లలున్నారని కొందరు.. ఆరోగ్యం క్షీణిస్తోందని మరికొందరు ఆవేదన

ప్రభుత్వం ఎలాగైనా తమను స్వస్థలాలకు తరలించాలని వేడుకోలు

భివండీ: వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు పెళ్లిళ్లకి వచ్చిన తెలంగాణ ప్రజలు భివండీలో ఇరుక్కుపోయారు. భివండీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తెలుగు వారుండే ప్రాంతాల్లో ఇంకా కరోనా వ్యాపించనప్పటికీ భివండీలో 13 మందికిపైగా కరోనా బారిన పడినవారున్నారు. ఇలాంటి నేపథ్యంలో పెళ్లిళ్లకు వచ్చి లాక్‌డౌన్‌ కారణంగా స్వగ్రామాలకు వెళ్లలేక, భివండీలో ఉండలేక తెలంగాణప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందిన వివరాల మేరకు సుమారు 100 మందికిపైగా భివండీలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. తమను ఎలాగైనా స్వగ్రామాలకు చేర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇలాంటి వారు అనేక మంది ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి తమ వినతిని తెలపాలని కోరుతున్నారు. ముఖ్యంగా వీరిలో కొందరు వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులు ఉండడంతో పంటలకు నష్టం వాటిల్లే ముప్పు ఉందని వాపోతున్నారు.

పద్మనగర్‌లో ...
మార్చి 19వ తేదీ పవర్‌లూమ్‌ కార్మికుడు నవజీవన్‌ కాలనీలో నివసించే అకెన్‌ కనుకయ్య కుమారుడు శ్రీనివాస్‌ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సిరిసిల్ల, కరీంనగర్‌ తదితర జిల్లాల నుంచి వచ్చిన సుమారు 35 మంది ఇరుక్కుపోయారు. అలాగే ఆదర్శనగర్‌లో టీ స్టాల్‌ నడిపే కూరపాటి వీరయ్య కుమార్తె స్రవంతి వివాహ వేడుకల కోసం వరంగల్‌ అర్బన్, జిల్లాలోని గట్ల నర్సింగపరం నుంచి వచ్చిన 11 మంది లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయారు. వ్యవసాయ కూలీలైన వీరు ఇరుకైన గదులలో ఉండలేక, సరైన భోజన వసతిలేక, పడుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొంటున్నారు. గాయత్రీనగర్‌ కి చెందిన జెల్ల రమేశ్‌ కూతురు రుషిక వివాహం కోసం యాదాద్రి జిల్లా ఆలేరు మండలంకు చెందిన ఆరుగురు భివండీ వచ్చి ఇక్కడే చిక్కుకుపోయారు.

కామత్‌ఘర్‌లో...
కామత్‌ఘర్‌లో కూడా కరీంనగర్, జనగాం జిల్లాలతోపాటు హైదరాబాద్‌ నుంచి వచ్చిన సుమారు 22 మందికిపైగా ఇరుక్కుపోయారు. మార్చి 19వ తేదీన మామిడాల ఈశ్వర్‌ కుమారుడు రాజేష్‌ వివాహం జరిగింది. ఈ వేడుకల కోసం వచ్చిన వీరందరూ లాక్‌ డౌన్‌ కారణంగా గత నెలరోజుల నుంచి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తోందని వాపోతున్నారు.

ధామన్‌కర్‌ నాకాలో..
ధామన్‌కర్‌ నాకా ప్రాంతంలో మార్చి 19వ తేదీన జరిగిన సైరెడ్డి మోహన్‌రెడ్డి కుమారుడు రాజశేఖర్‌ రెడ్డి వివాహ వేడుకల్లో సుమారు 80 మంది బంధువులు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి రాగా వీరిలో తొమ్మిది మంది మాత్రం భివండీలోనే ఇరుక్కుపోయారు.

భివండీ తాలూకా కరివళి గ్రామంలో..
భివండీ తాలూకాలోని కరివళి గ్రామంలో సిరిసిల్లా నుంచి వచ్చిన తొమ్మిది మంది ఇరుక్కుపోయారు. వీరందరు కరివళి గ్రామానికి చెందిన తుమ్మ శ్రీనివాస్‌ కుమారుడు శైలేష్‌ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు.

కోతకు వచ్చిన పంట ఏమవుతుందో...
ఇంట్లో చిన్న పిల్లలను విడిచి వచ్చాం. వరి, మొక్కజొన్న కోతకు వచ్చింది. ఊర్లో గాలి దుమారం, వాన వచ్చిందంట. చేతికొచ్చిన పంట మట్టి పాలవుతుందోమోనని భయంగా ఉంది. మమ్మల్ని ఊరికి పంపించండి.  –కొచెర్ల యాదగిరి (వరంగల్‌ జిల్లా కుమ్మరి గూడెం గ్రామం)

వాతావరణం పడక ఇబ్బంది.. 
సిరిసిల్లలో మాకు పవర్‌లూమ్‌ పరిశ్రమలు ఉన్నాయి. మావద్ద 8 మంది ఉత్తర భారతీయులు పనిచేస్తున్నారు. మేము ఇక్కడ, వారు అక్కడా చిక్కుకుపోయాం. ఇక్కడ భోజనానికి కూడా ఇబ్బందులు పడుతున్నాం, నాకు ముందు నుంచే ఆరోగ్యం బాగా లేదు. ఇక్కడ వాతావరణం పడక మరింత ఇబ్బందులు పడుతున్నా. –ఆకెన్‌ రాజేశం (సిరిసిల్ల)

కుమారుని ఆరోగ్యం క్షీణిస్తోంది... 
దగ్గరి బంధువులు కావడంతో పెండ్లికి మా ఇద్దరి పిల్లలను తీసుకొచ్చాను. నా భర్త సిరిసిల్లలోనే ఉన్నాడు, మా అబ్బాయి అభినవ్‌కి ఫిట్స్‌ వ్యాధి ఉంది. నెల రోజులుగా ఇక్కడ ఒకే గదిలో ఉండటం వలన ఆరోగ్యం క్షీణించిపోతోంది. మమ్మల్ని ఎలాగైనా మా ఊరికి తీసుకెళ్లండి. –క్యాతం రూప (సిరిసిల్ల)

ఆసుపత్రి నుంచి ఫోన్లు వస్తున్నాయి... 
ప్రభుత్వ ఆసుపత్రిలో కంపౌండర్‌గా పనిచేస్తున్నాను. తిరిగి రమ్మని డాక్టర్లు ఫోన్లు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా నేను భివండీలో ఇరుక్కుపోయాను. మా ఇంట్లో వృద్ధులున్నారు. –కొండ సంతోశ్‌ (సిరిసిల్ల)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా