మహిళా ఉద్యోగుల భద్రతలో తెలంగాణకు రెండోర్యాంకు

21 Sep, 2016 12:36 IST|Sakshi
మహిళా ఉద్యోగుల భద్రతలో తెలంగాణకు రెండోర్యాంకు

ఉద్యోగాలు చేసే మహిళలకు ఢిల్లీ నగరం పరమ వేస్ట్ అని, ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం బెస్ట్ అని తేలింది. రెండోస్థానంలో తెలంగాణ నిలవగా, ఆంధ్రప్రదేశ్‌కు ఆరోస్థానం లభించింది. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్), నాథన్ అసోసియేట్స్ సంస్థలు సంయుక్తంగా చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మహిళల ఉద్యోగాలకు అనువైన నగరాల విషయంలో ఢిల్లీకి కేవలం 8.5 పాయింట్లు రాగా, సిక్కింకు అత్యధికంగా 40 పాయింట్లు వచ్చాయి. ప్రధానంగా నాలుగు అంశాల ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చారు. ఫ్యాక్టరీలు, రీటైల్, ఐటీ పరిశ్రమలో మహిళల పని గంటలపై చట్టబద్ధమైన నియంత్రణలు, ఉద్యోగాలు చేసే మహిళల మీద జరిగే నేరాలను (లైంగిక వేధింపుల లాంటివి) అరికట్టేందుకు తగిన న్యాయ వ్యవస్థ, రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగులలో మహిళల శాతం, మహిళా వ్యాపారవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు.. ఈ నాలుగు అంశాల ఆధారంగా వివిధ రాష్ట్రాలు మహిళలకు ఎంతవరకు అనుకూలమో తేల్చారు.

సిక్కిం తర్వాతి స్థానంలో తెలంగాణ (28.5), పుదుచ్చేరి (25.6), కర్ణాటక (24.7), హిమాచల్ ప్రదేశ్ (24.2), ఆంధ్రప్రదేశ్ (24.0), కేరళ (22.2), మహారాష్ట్ర (21.4), తమిళనాడు (21.1), ఛత్తీస్‌గఢ్ (21.1) వరుసగా ఉన్నాయి.  సిక్కిం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో అయితే.. మహిళలు రాత్రిపూట పనిచేయడంపై ఉన్న నియంత్రణలను పూర్తిగా ఎత్తేశాయి. ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కోర్టు తీర్పు కారణంగా ఇలా చేశాయి. మహారాష్ట్రలో మహిళలు కేవలం రాత్రి 10 గంటల వరకు మాత్రమే పనిచేయాలంది కాబట్టి ఆ రాష్ట్రానికి తగినంత స్కోరు రాలేదు.

దేశంలో తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అసలు రాత్రిపూట ఏ రంగంలోనూ మహిళలతో పని చేయించడానికి ఒప్పుకోవు. 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మహిళా వ్యాపారవేత్తలకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందజేయవు. ఢిల్లీలో మొత్తం ఉద్యోగులలో మహిళల సంఖ్య చాలా తక్కువని, అలాగే అక్కడ న్యాయం అందడం కూడా చాలా ఆలస్యం అవుతుందని నివేదికలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు