ఐటీ, పారిశ్రామిక రంగాలకు నిరాశే..!

2 Feb, 2020 03:05 IST|Sakshi

రాష్ట్ర ప్రతిపాదనలను పట్టించుకోని కేంద్ర బడ్జెట్‌

పారిశ్రామిక వాడలు, ఫార్మాసిటీ, స్టీల్‌ ప్లాంటు ఊసేలేదు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటీ రంగాల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిం చేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలకు కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు నిరాశను మిగిల్చాయి. ఆహారశుద్ధి, ఎయిరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, ఐటీ తదితర రంగాలను ప్రోత్స హించడం ద్వారా ఆర్ధికాభి వృద్ధి, ఉద్యోగ కల్పన సాధ్యమని రాష్ట్ర ప్రభు త్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫార్మాసిటీ, జహీరాబాద్‌ నిమ్జ్‌లో మౌలిక సౌకర్యాలకు నిధులు, ఆహారశుద్ధి, టెక్స్‌టైల్‌ పార్కులకు నిధులు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, విభజన చట్టం హామీ మేరకు బయ్యారంలో స్టీల్‌ ప్లాంటు, ఐటీఐఆర్‌ ప్రాజెక్టు తదితరాల కోసం కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఆశించింది.

హైదరాబాద్‌ ఫార్మాసిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 16,375 కోట్లు కాగా, మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.6వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించినా బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఈ ప్రస్తావన లేదు. ఐటీ రంగానికి గాను 2013లో ఐటీఐఆర్‌ ప్రాజెక్టుకు రూ.3,275 కోట్లు అవసరమవు తాయని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం  నిధుల కోసం ఏళ్ల తరబడి కేంద్రానికి లేఖలు రాస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌లో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో 6 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించగా, తొలి దశలో హైదరాబాద్‌–వరంగల్‌ కారిడార్‌ అభివృద్ధిని త్వరితగతిన చేపట్టాలని రాష్ట్రం భావిస్తోంది. శనివారం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌–2020–21లో వీటి ఊసు లేకపోవడంపై పరిశ్రమల శాఖ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

‘ఎలక్ట్రానిక్స్‌’కు ఊతం 
ఎలక్ట్రానిక్స్‌ సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని ప్రోత్సహించి సిలికాన్‌ వ్యాలీ తరహాలో హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. తాజా కేంద్ర బడ్జెట్‌లో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు ఓ విధానం ప్రకటిస్తామన్న నేపథ్యంలో కొంత లబ్దిచేకూరనుంది.

సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో 250 ఎకరాల్లో ఇప్పటికే మెడికల్‌ డివైజెస్‌ పార్కును ఏర్పాటు చేయగా, బడ్జెట్‌లో దానికి ఊతమిస్తామని కేంద్రం ప్రకటించింది. బడ్జెట్‌లో నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌ ద్వారా వచ్చే నాలుగేళ్లలో రూ.1480 కోట్లు ఖర్చు చేస్తామని ప్రతిపాదించారు. దీంతో కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కు అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం నామమాత్రంగా లభించే సూచనలున్నాయి.

ఆరు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి 
వచ్చే నాలుగేళ్లలో రూ.1.03లక్షల కోట్లతో వివిధ రంగాల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్న కేంద్రం.. ఉడాన్‌ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 2024 నాటికి వంద ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని బడ్జెట్‌లో పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే 6 ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా సర్వే నిర్వహించింది. జక్రాన్‌పల్లి (నిజామాబాద్‌), అడ్డాకుల (మహబూబ్‌నగర్‌), పునుకుడుచెర్ల (భద్రాద్రి కొత్తగూడెం)లో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుతో పాటు బసంత్‌నగర్‌ (పెద్దపల్లి), మామునూరు (వరంగల్‌), ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుల  అభివృద్ధి పనులు వేగవంతమయ్యే అవకాశం ఉంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా