వారంపాటు ఉచిత డేటా సేవలు : ఎయిర్‌టెల్‌

17 Aug, 2018 10:53 IST|Sakshi

కేరళవాసుల సేవలో టెలికాం కంపెనీలు..!

తిరువనంతపురం : హోరు వానలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు ఆపన్నహస్తం అందించేందుకు టెలికాం దిగ్గజాలు.. రిలయెన్స్‌ జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌టెల్‌లు మందుకొచ్చాయి. ప్రీపెయిడ్‌ కస్టమర్లకు ఉచిత కాల్స్‌, డేటా సేవలను అందిస్తామని తెలిపాయి. పోస్ట్‌పె​యిడ్‌ కస్టమర్లు చెల్లించాల్సిన బిల్లులకు గడవు తేదీని పెంచాయి. వారం రోజులపాటు ఉచిత మొబైల్‌ సేవలు అందిస్తామని రిలయన్స్‌ జియో.. అన్‌లిమిటెట్‌ కాల్స్‌, అపరిమిత డేటా..  రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు అందిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపాయి.

చార్జింగ్‌ సేవలు..
ఎయిర్‌టెల్‌ కూడా తన వంతుగా 30 రూపాయల టాక్‌టైమ్‌.. వారం రోజులపాటు 1 జీబీ డేటాను ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ మాట్లాడుతూ.. కరెంట్‌, ఇంధనం కొరత ఉన్నా.. మా నెట్‌వర్క్‌ సేవలను కొనసాగిస్తున్నామని తెలిపారు. త్రిసూర్‌, కాలికట్‌, మలప్పురం, కన్నూర్‌, త్రివేంద్రం, ఎర్నాకులం వంటి ప్రాంతాల్లోని  ఎంపిక చేసిన కొన్ని ఎయిర్‌టెల్‌ స్టోర్లలో మొబైల్‌ ఫోన్లు చార్జ్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించామని తెలిపారు. అక్కడ నుంచి అపరిమిత కాల్స్‌ చేసుకునే అవకాశం కూడా అందిస్తున్నామని వెల్లడించారు.

కాగా, కేరళలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 94కు పెరిగింది. వరదల బీభత్సంతో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక వరద నీరు నిలిచిపోవడంతో కొచ్చి ఎయిర్‌పోర్ట్‌ను శనివారం వరకు మూసివేశారు. మరోవైపు పలు రైలు సర్వీసులు రద్దుకాగా, మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు