శబరిమలను చూశా.. మళ్లీ వస్తానని మొక్కుకున్నా

20 Oct, 2018 01:18 IST|Sakshi

సాక్షి ప్రతినిధితో మోజో టీవీ ప్రజెంటర్‌ కవిత

పోలీసుల రక్షణతో అయ్యప్ప ఆలయం సమీపానికి వెళ్లగలిగా

ఆహారం లేకున్నా, రాళ్లు పడుతున్నా ముందడుగు వేశా

గుడి ముందు వంద మంది పిల్లలతో రక్షణ కవచం చూసి చలించిపోయా

వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకే వెనక్కి వచ్చా

వచ్చేసారి మాత్రం ఓడించొద్దని అయ్యప్పను వేడుకున్నా

సాక్షి, హైదరాబాద్‌ : ‘ఎలాౖగైనా శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనే బయలుదేరా. దారి పొడవునా దాడులెదురైనా.. స్వామి వారిని చూసి దర్శించుకుని రావాల్సిందేననుకున్నా. కానీ శబరిమల దేవాలయానికి కేవలం 100 మీటర్ల దూరంలో వంద మంది చిన్నపిల్లల మానవ కవచాన్ని చూసి చలించిపోయా. నేను దేవాలయంలోకి వెళ్లాలంటే ఈ పిల్లల్ని దాటుకుంటూ వెళ్లాలి. నేను వెళ్లే దారిలో స్వయంసేవకులు, శివసైనికుల రాళ్ల దాడులు.. నేను మొండిగా అలాగే ముందుకు వెళ్తే పిల్లలకు దెబ్బలు తగిలి శబరిలో రక్తపాతం జరిగే అవకాశం ఉందనిపించింది. అందుకే నేను కేవలం పిల్లల మొహాలు చూసి వెనక్కి వచ్చా. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పవిత్ర శబరి పరిసరాలను తాకే వచ్చా. ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. ఆ పరిసరాల్లోకి వెళ్లిన తొలి మహిళగా.. ఆ దేవాలయంలోకి వెళ్లేందుకు మళ్లీ కచ్చితంగా ప్రయత్నిస్తా. ఆ ప్రయత్నంలో ఓటమి పాలుచేయొద్దని అయ్యప్పను వేడుకున్నా’అని హైదరాబాద్‌కు చెందిన మోజో టీవీ ప్రజెంటర్‌ జక్కుల కవిత చెప్పారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ తిరుగు ప్రయాణమైన కవిత పంబా నుంచి సాక్షి ప్రతినిధితో మాట్లాడారు.

తొలి రోజు నుంచే ప్రయత్నం...
శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాల్సిందేనంటూ గత నెల 28న సుప్రీంకోర్టు తీర్పునివ్వటం, నెలవారీ పూజల కోసం దేవాలయాన్ని బుధవారం తెరుస్తారన్న సమాచారంతో కవిత మరో ఇద్దరితో కలసి ఈ నెల 16న హైదరాబాద్‌ నుంచి శబరిమల బయలుదేరి వెళ్లారు. బుధవారమే కుటుంబ సభ్యులతో కలసి పంబాకు వెళ్లిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాధవి (45)ని ఆందోళనకారులు తిప్పి పంపగా కవిత మాత్రం తాను నిర్ణయించుకున్న విధంగానే బుధవారం ఉదయం నీళక్కల్‌ చేరుకుని అక్కడి నుంచి కారులో పంబా బయల్దేరారు. అప్పటికే జర్నలిస్టుల వాహనాలపై ఆందోళనకారులు దాడులు చేస్తూ వెనక్కి పంపేస్తుండటంతో పోలీసులు సైతం కవిత బృందం ముందుకు వెళ్లటం శ్రేయస్కరం కాదని చెప్పారు. అయినా పంబా వైపు కవిత వాహనం వెళ్లడంతో అక్కడి ఆందోళనకారులు దాడి చేసి కారును ధ్వంసం చేసి వెనక్కి పంపారు. గురువారం మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించిన ఆమె పోలీసుల భద్రత కోరారు. అయితే నీళక్కల్‌ పోలీసులు 17 కి.మీ.లు వరకు తోడుగా వచ్చి అడవి మధ్యలో దించేసి తమ పరిధి ఇంతవరకేనన్నారు. అక్కడి నుంచి వేరే జిల్లా పోలీసులు రక్షణ కల్పిస్తారని వారు కవితకు చెప్పినా పోలీసులెవరూ రాకపోవడంతో దారిలో కనిపించిన మరో మీడియా వాహనం ఎక్కి సాయంత్రానికి కవిత బృందం పంబాకు చేరుకుంది.

వచ్చే ఏడాది కచ్చితంగా దర్శించుకుంటా...
‘‘పంబా నుంచి ముందుకు కదులుతూ ప్రధాన ఆలయానికి చివరి ఐదు కిలోమీటర్ల దూరానికి వచ్చాం. కానీ అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా పోలీసు వలయం తప్పనిసరి. వేలాది మంది ఆందోళనకారులు రాళ్లు, కర్రలతో దాడులకు సిద్ధం గా ఉన్నారు. ఆ సమయంలో మరో ఆంగ్ల పత్రికకు చెందిన సుహాసిని అనే మహిళా జర్నలిస్టుతో కలసి నేను పోలీసు రక్షణ కోరగా రాత్రి వెళ్లడం శ్రేయస్కరం కాదు.. రేపు ఉదయం వెళ్లండి రక్షణ కల్పిస్తామన్నారు. అప్పటికి చీకటి పడింది. ఉండటానికి అక్కడ గదులేవీ లేవు. కనీసం కూర్చునే వీలు లేదు. ప్రాణా లు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ అడవిలోనే చెట్ల కింద రాత్రంతా జాగారం చేశాం. అప్ప టికే ఏమీ తినక 24 గంటలు గడిచిపోయింది. అయి నా మర్నాటి ఉదయం కోసం వేచి చూశా. కానీ ఉద యం 9 గంటలవుతున్నా పోలీసులు రక్షణ కల్పించలేదు. నేను, మరో మహిళా జర్నలిస్టు కలసి ఆందో ళనకు సిద్ధమవడంతో అప్పుడు పోలీసులే రక్షణగా ఉండి హెల్మెట్లు, జాకెట్లు వేసి మాతో కలసి ముందు కు కదిలారు.

అప్పటికే మాపై రాళ్ల వర్షం మొదలైంది. ఓ పెద్దరాయి వచ్చినా తలను రాసుకుంటూ వెళ్ల డంతో నా చెవికి దెబ్బ తగిలింది. రాళ్ల ఉధృతికి భయపడ్డ సుహాసిని ఒక్క కిలోమీటర్‌ వరకు వచ్చి వెనుతిరిగింది. నేను మాత్రం అలాగే ముందుకు వెళ్లా. గణ పతి ఆలయం దాటి కిందకు దిగిన అనంతరం ఎదురుగా శబరిమల ప్రధాన ఆలయ పరిసరాలన్నీ ఆం దోళనకారులతో నిండి ఉన్నాయి. గో బ్యాక్‌.. గో బ్యాక్‌ నినాదాలతో మార్మోగుతున్నాయ్‌. అయినా నేను అడుగులు ఆపలేదు. ఆలయం ఎదురుగా వం ద మంది చిన్నపిల్లలు. వారి వెనకాల వందల మంది ఆందోళనకారులు. అడుగు ముందుకు వేస్తే దాడులు తథ్యం.. దానివల్ల పిల్లలకు ఇబ్బంది. దీనికితోడు నేను అడుగు ముందుకేస్తే ఆలయం మూసేస్తామని ప్రధాన పూజారుల హెచ్చరికలు. ముఖ్యంగా పిల్లల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని వెనక్కి వచ్చా. విజయం నాదే. మళ్లీ ఏడాది కచ్చితంగా అయ్యప్పను దర్శించుకుని తీరుతా’’అని కవిత చెప్పారు.

ఎవరీ కవిత..?
నల్లగొండ పట్టణం గొల్లగూడకు చెందిన కవిత ఎంటెక్‌ వరకు చదువుకున్నారు. న్యూస్‌ ప్రజెంటర్‌గా తొలుత నల్లగొండలోని స్థానిక చానెల్‌లో పనిచేసిన ఆమె ఆ తర్వాత వివిధ చానళ్లలో పనిచేశారు. ప్రస్తుతం ఆమె మోజో టీవీ ప్రజెంటర్‌గా పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు