దేశ భాషలందు చిక్కిపోతున్న తెలుగు...!

27 Jun, 2018 22:32 IST|Sakshi

మాతృభాషల్లో నాలుగోస్థానానికి పడిపోయిన తెలుగు...

దేశంలోని అత్యధికులు సంభాషించే మాతృభాషల్లో తెలుగు మూడోస్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. తెలుగు స్థానాన్ని మరాఠి భర్తీచేసి మూడోస్థానానికి చేరుకుంది. 2011 జనాభా గణనలో భాగంగా దేశంలోని మాతృభాషలకు సంబంధించి తాజాగా వెల్లడైన  వివరాలను బట్టి ఈ అంశం వెల్లడైంది. మొత్తం జనాభాలో 96.71 శాతం మంది దేశంలో గుర్తించిన  22 భాషల్లో ఏదో ఒక భాషను తమ మాతృభాషగా నమోదు చేసుకున్నారు. మిగతా 3.29 శాతం మంది ఇతర భాషలను తమ భాషగా ఎంపికచేసుకున్నారు.

2001 జనాభా లెక్కల ప్రకారం 7.19 శాతం మంది (మొత్తం దేశజనాభాలో) తెలుగును తమ మాతృభాషగా ఎంచుకున్నారు. అదే 2011 లెక్కలకు వచ్చేప్పటికీ అది 6.93 శాతానికి  తగ్గిపోయింది. అదేసమయంలో మరాఠి మాతృభాషగా ఎంపిక చేసుకున్న వారు 6.99 శాతం నుంచి 7.09 శాతానికి వృద్ధి చెందారు. ఈ విధంగా తెలుగును మరాఠి భాష అధిగమించింది. తెలుగు మాట్లాడేవారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకే పరిమితం కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లోనూ ఉన్నారు.

హిందీ టాప్‌...సంస్కృతం లాస్ట్‌
దేశ జనాభాలో హిందీని మాతృభాషగా ఎంచుకుంటున్న వారు మాత్రం గణనీయంగా పెరిగారు. 2001 లెక్కల ప్రకారం 41.03 శాతమున్న వీరి సంఖ్య 2011 నాటికి 43.63 శాతానికి  పెరిగింది. హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాషగా బాంగ్లా (బెంగాలీ) కొనసాగుతోంది. గతంలో 8.11 శాతమున్న బాంగ్లా మాట్లాడే వారి సంఖ్య  తాజా లెక్కల్లో 8.3 శాతానికి పెరిగింది.  దేశంలో గుర్తించిన (రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో చేర్చిన) 22 భాషల్లో సంస్కృతం మాత్రం ఈ విషయంలో  చిట్టచివరి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బోడో, మణిపురి, కోంకణి, డోగ్రీ భాషలు మాట్లాడే వారి కంటే కూడా ఈ భాషను తక్కువమంది మాట్లాడుతున్నారు.  కేవలం 24,821 మంది మాత్రమే సంస్కృతాన్ని తమ మాతృభాషగా పేర్కొన్నారు.

రెండున్నరలక్షల మందికి ఇంగ్లిష్‌...
మన దేశంలో మాతృభాషగా గుర్తించని ఇంగ్లిష్‌ను (షెడ్యూల్డ్‌ లాంగ్వేజేస్‌లో చేర్చని) మాత్రం 2.6 లక్షల మంది తాము మొదట మాట్లాడే భాష(ఫస్ట్‌ స్పోకెన్‌ లాంగ్వేజ్‌)గా  పేర్కొనడం విశేషం.  ఇంగ్లిష్‌ మాతృభాషగా ఉన్నవారు లక్ష మందికి పైగా మహారాష్ట్రలో నివసిస్తున్నారు.  ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక నిలుస్తున్నాయి. మనదేశంలో గుర్తింపు పొందని భాషల్లో రాజస్థాన్‌లోని కోటి మందికి పైగా    భిలి / భిలోడి భాష మాట్లాడుతున్నారు. గోండీ భాషను 29 లక్షల మంది సంభాషిస్తున్నట్టు  2011 జనాభా గణన సమాచారాన్ని బట్టి వెల్లడైంది. గతంలోని జనాభా లెక్కల ప్రకారం ఆరోస్థానంలో ఉన్న ఉర్థూ కాస్తా ప్రస్తుతం ఏడోస్థానానికి పడిపోయింది. మొత్తం 4.74 శాతం మాట్లాడేవారితో గుజరాతీ భాష ఆరోస్థానానికి చేరుకుంది.


2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే...
భాష        మాతృభాష మాట్లాడేవారు        మొత్తం జనాభాలో శాతం
హిందీ         52,83,47,193                    43.63
బాంగ్లా        09,72,37,669                     08.30
మరాఠి        08,30,26,680                    07.09
తెలుగు       08,11,27,740                   06.93
తమిళం      06,90,26,881                   05.89

మరిన్ని వార్తలు