పర్యాటక రంగంలో తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట

27 Sep, 2019 15:37 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: జాతీయ స్థాయిలో పర్యాటక రంగానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట పండింది. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగంలో సాధించిన అభివృద్ధికి గానూ, ఈ ఏడాదికి ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవార్డు దక్కించుకుంది. ఇక బెస్ట్‌ టూరిస్ట్‌ ఫ్రెండ్లీ రైల్వేస్టేషన్‌గా విశాఖపట్నం అవార్డును కైవసం చేసుకుంది. అలాగే ఉత్తమ కాఫీటేబుల్‌ బుక్‌ కేటగిరీలోనూ ఏపీ ప్రథమ స్థానాన్ని అందుకుంది.

తెలంగాణ పర్యాటక శాఖకు ఈ ఏడాది రెండు అవార్డులు దక్కాయి. సాంకేతికతను అత్యుత్తమంగా, వినూత్నంగా వినియోగించుకొనే రాష్ట్రంగా తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. టూరిస్టులకు పర్యాటక ప్రదేశాలకు సంబంధించి విస్తృత సమాచారం అందించడం కోసం పర్యాటక శాఖ రూపొందించిన 'ఐ ఎక్స్‌ప్లోర్ తెలంగాణ' అనే మొబైల్ యాప్‌కు ఈ అవార్డు దక్కింది. బెస్ట్ మెడికల్ టూరిజం విభాగంలో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి జాతీయ స్థాయి అవార్డు దక్కింది.

ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఈ అవార్డులను అందుకున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా 2017-18 సంవత్సరానికి సంబంధించి జాతీయ టూరిజం అవార్డులను ప్రకటించారు.  అడ్వెంచర్‌ టూరిజం కేటగిరీలో గోవా, మధ్యప్రదేశ్ అవార్డులను పొందాయి. సినిమా ప్రమోషన్లకు ఉత్తమ స్నేహ పూర్వక రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ ఎంపికైంది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ గతంలో పర్యాటక రంగానికి ఆదరణ తక్కువని, ప్రస్తుతం భారత్‌లో పర్యాటకులకు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నామన్నారు.

మరిన్ని వార్తలు