ఢిల్లీ @ 2.6 c

30 Dec, 2018 02:18 IST|Sakshi
శనివారం ఢిల్లీలో పొగమంచుతో నిండిన రాజ్‌పథ్‌ పరిసర ప్రాంతం

న్యూఢిల్లీ: దేశరాజధానిలో ప్రజలను చలిపులి వణికిస్తోంది. ఢిల్లీలో శనివారం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 2.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ఇది ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత కావడం గమనార్హం. మరోవైపు పొగమంచు కారణంగా దృశ్యత 1,500 మీటర్లకు పడిపోయింది. ఇక పాలెం విమానాశ్రయంలో 800 మీటర్ల దూరంలోని వస్తువులు సైతం కనిపించకుండా మంచు దుప్పటి కమ్మేసింది. ఈ విషయమై భారత వాతావరణశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో పొగమంచు సాధారణ స్థాయిలోనే కురుస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం దట్టంగా కురుస్తోందని తెలిపారు.

ఆకాశం నిర్మలంగానే ఉన్నప్పటికీ చలిగాలుల తీవ్రత మాత్రం కొనసాగుతుందని వెల్లడించారు. హరియాణా, ఢిల్లీ, చండీగఢ్‌లోని చాలా ప్రాంతాల్లో సోమవారం వరకూ చలిగాలులతో పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయనీ, మిగిలిన కొన్ని చోట్ల మాత్రం తీవ్రమైన చలిగాలులు వీస్తాయని పేర్కొన్నారు. పంజాబ్‌తో పాటు ఉత్తర, పశ్చిమ రాజస్తాన్‌లో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు ఢిల్లీలో శనివారం వాయు నాణ్యత సూచీ 398 పాయింట్లకు చేరుకున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) తెలిపింది.

కశ్మీర్‌లో మైనస్‌ ఉష్ణోగ్రతలు..
ఇక జమ్మూకశ్మీర్‌లోని లేహ్, కార్గిల్‌ ప్రాంతాల్లో  ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్ర వేసవి రాజధాని శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్‌ 7.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇది గత మూడు దశాబ్దాల్లోనే అత్యల్ప ఉష్ణోగ్రత కావడం గమనార్హం. కాజీగంద్‌లో మైనస్‌ 6.2, కుప్వారాలో మైనస్‌ 6, అమర్‌నాథ్‌ యాత్రికులకు బేస్‌ క్యాంప్‌గా ఉన్న పెహల్గామ్‌లో మైనస్‌ 8.3 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత నమోదయింది.

మరిన్ని వార్తలు