చలి చంపేస్తోంది!

26 Dec, 2018 02:42 IST|Sakshi

దేశవ్యాప్తంగా తగ్గిన ఉష్ణోగ్రతలు..

హైదరాబాద్‌లో సాధారణంకంటే 2–3 డిగ్రీల మేర తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు

మరో మూడు రోజుల్లో 14 డిగ్రీలకు చేరుకునే అవకాశం

న్యూఢిల్లీ /సాక్షి, హైదరాబాద్‌: చలి గజగజ వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాలతోసహా దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువకి పడిపోయాయి. సాధారణంగా శీతాకాలంలో ఉత్తరాది నుంచి మధ్య భారతం మీదుగా తెలంగాణ నుంచి ఒడిశా వరకు చలిగాలులు బలంగా వీస్తాయి. తెలంగాణ, ఏపీలలో పొడి వాతావరణం ఉండటం వల్ల ఆ గాలుల ప్రభావం తీవ్రంగా ఉండి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ముఖ్యంగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటాయి. ప్రతి ఏడాది ఇలా నాలుగైదుసార్లు జరుగుతుం ది. గతవారంలో పెథాయ్‌ తుఫాన్‌ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తే, ఇప్పుడు ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.  

చలి దుప్పట్లో ఉత్తర భారతం 
ఉత్తరభారతం చలి గుప్పిట్లో చిక్కుకుంది. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌ తదితర రాష్ట్రాల్లో 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీసహా వాయవ్య భారతంలో వచ్చే రెండు మూడ్రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా సింగిల్‌ డిజిట్‌కి చేరుకోవడంతో పంటలపై కూడా ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఒకట్రెండు రోజుల్లో రెండు డిగ్రీలకు పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

గడ్డకట్టిన దాల్‌ సరస్సు 
చలితో జమ్ము కశ్మీర్‌ వాసులు గజగజలాడుతున్నారు. రోజురోజుకి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత 11 ఏళ్లలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు మైనస్‌ 6.8 డిగ్రీలకు పడిపోయాయి. ఫలితంగా ప్రఖ్యాత దాల్‌ సరస్సులో కొంత భాగం గడ్డ కట్టింది. వాటర్‌ పైపులలో కూడా నీరు గడ్డ కట్టేయడంతో ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందిగా మారింది. ఇలా సరస్సులు కూడా గడ్డ కట్టేయడం గత పదకొండేళ్లలో ఇప్పుడే జరిగింది. ఇక కార్గిల్‌లో మైనస్‌ 15.3 డిగ్రీల సెల్సియల్‌ నమోదైంది.  

తెలంగాణలో పొడి వాతావరణం 
ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే తెలంగాణలో మాత్రం వచ్చే రెండ్రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు. దీనివల్ల ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో వచ్చే రెండ్రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.  

వణుకుతున్న హైదరాబాద్‌ 
వేగంగా పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలతో హైదరాబాద్‌ గజగజలాడుతోంది. మంగళవారం కనిష్టంగా 16.3 డిగ్రీలు, గరిష్టంగా 31.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంకంటే 2–3 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాగల మూడురోజుల్లో నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో తేమ శాతం కూడా 44 శాతానికి తగ్గడంతో చలితీవ్రత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం, రాత్రి వేళల్లో వీస్తోన్న శీతలగాలులు వృద్ధులు, రోగులు, చిన్నారులను గజగజలాడిస్తున్నాయి. ప్రస్తుత సీజన్‌లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు అసాధారణమేమీ కాదని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు ‘సాక్షి’కి తెలిపారు.  
 

మరిన్ని వార్తలు