సెంట్రల్‌ జైలులో కరోనా కలకలం..

13 May, 2020 18:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : ఆగ్రా సెంట్రల్‌ జైలులో 10 మంది ఖైదీలకు కరోనా సోకినట్టు ఉత్తరప్రదేశ్‌ జైళ్ల శాఖ డీజీ అనంద్‌ కుమార్‌ వెల్లడించారు. దీంతో జైలు సిబ్బందితోపాటు, ఇతర ఖైదీల్లో కలవరం మొదలైంది. వివరాల్లోకి వెళితే.. ఆగ్రా సెంట్రల్‌ జైలులో ఉన్న ఓ ఖైదీకి కొద్ది రోజుల కిందట కరోనా సోకినట్టుగా తేలింది. దీంతో జైలులో ఆ ఖైదీకి సన్నిహితంగా ఉన్న 14 మందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా.. 10 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారిని ఐసోలేషన్‌ సెంటర్లకు తరలించారు.(చదవండి : మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం: ఖైదీల విడుదల)

ఈ నేపథ్యంలో జైలులోని సిబ్బందికి, ఇతర ఖైదీలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని జైలు అధికారులు.. వైద్య అధికారులను కోరారు. జైలులో మొత్తం 1,941 మంది ఖైదీలు, అధికారులతో కలిపి 121 మంది సిబ్బంది ఉన్నారు. కాగా, ఇటీవల ముంబైలోని ఆర్థర్‌ రోడ్డు జైలులో దాదాపు 185 మంది ఖైదీలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో జైళ్లలోని ఖైదీల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర  ప్రభుత్వం రాష్ట్రంలోని సగం మంది ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. వారిని పెరోల్‌ లేదా తాత్కాలిక బెయిల్‌పై బయటకు పంపనున్నట్టు తెలిపింది. (చదవండి : మహిళా ఖైదీకి కరోనా పాజిటివ్‌)

మరిన్ని వార్తలు