పదో తరగతిలోనే పాఠశాల హెచ్‌ఎంగా..

29 Jan, 2020 11:20 IST|Sakshi
హెచ్‌ఎం సీటులో రిజిస్టర్‌ను పరిశీలిస్తున్న మధుమిత

చెన్నై ,వేలూరు(తిరువణ్ణామలై): పదో తరగతి అర్ధ సంవత్సరపు పరీక్షల్లో పాఠశాలలోనే మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని ఒక్క రోజు ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసింది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా పుదుపట్టు గ్రామానికి చెందిన సౌందర్‌రాజన్‌ కుమార్తె మధుమిత(14) నెచ్చల్‌ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. హెచ్‌ఎం వెంకటేశన్, 8 మంది టీచర్‌లు, ఇద్దరు కార్యాలయ సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు. విద్యార్థులను ఉత్సాహ పరిచేందుకు 10వ తరగతి అర్థ సంవత్సర పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించే వారిని ఒక్క రోజు హెచ్‌ఎంగా పనిచేయవచ్చని హెచ్‌ఎం వెంకటేశన్‌ తెలిపాడు. ఈ నేపథ్యంలో మధుమిత 447 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది.

ఒక రోజు హెచ్‌ఎంగా బాధ్యతలు స్వీకరించిన మధుమితతో హెచ్‌ఎం, టీచర్‌లు
దీంతో సోమవారం హెచ్‌ఎం వెంకటేశన్, ఉపాధ్యాయులు మధుమితను విద్యార్థుల సమక్షంలో ప్రధానోపాధ్యాయుడి సీటులో కూర్చో పెట్టారు. ఈ సందర్భంగా మధుమిత రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం 10వ తరగతి గదికి వెళ్లి సహ విద్యార్థుల వద్ద పాఠ్య పుస్తకాలకు సంబంధించి ప్రశ్నలను అడిగారు. అనంతరం హెచ్‌ఎంగా ఒక రోజు పనిచేసిన వేతనాన్ని పాఠశాల అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు. ఈ సందర్భంగా మధుమిత మాట్లాడుతూ.. ఒక రోజు హెచ్‌ఎంగా పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వీటిని జీవితంలో మరవలేనంది. తనను ఉత్సాహ పరిచి మొదటి ర్యాంకులు సాధించేందుకు కారణమైన హెచ్‌ఎం వెంకటేశన్, టీచర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు