టెన్త్‌ మ్యాథ్స్‌ రీ–ఎగ్జామ్‌ లేదు

4 Apr, 2018 02:05 IST|Sakshi

మానవ వనరుల శాఖ నిర్ణయం

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పదో తరగతి విద్యార్థులకు ఉపశమనం. ప్రశ్నపత్రం బహిర్గతమైందని ఆరోపణలు వచ్చిన గణితం పేపర్‌కు పునఃపరీక్ష నిర్వహించకూడదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది. లీకేజీ ప్రభావాన్ని ప్రాథమికంగా అంచనా వేసిన తరువాతే విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా శాఖ కార్యదర్శి అనిల్‌ స్వరూప్‌ మంగళవారం వెల్లడించారు.

ముందుగా అనుకున్నట్లుగా ఢిల్లీ, రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌), హరియాణాలో కూడా పునఃపరీక్ష ఉండదని స్పష్టం చేశారు. ‘పదో తరగతి 11వ తరగతికి ప్రవేశద్వారం లాంటిది. అది పాఠశాల విద్యలో అంతర్భాగం. కానీ 12వ తరగతి ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు కీలకం.

ఈ దశలో లీకేజీ వల్ల కొందరు అనుచిత లబ్ధి పొందడం మంచిది కాదు’ అని సీబీఎస్‌ఈ పేర్కొంది. ఇప్పటి వరకూ మూల్యాంకనం చేసిన కొన్ని పదో తరగతి గణితం సమాధాన పత్రాల్లో లీకేజీ వల్ల ఎవరూ లబ్ధి పొందినట్లు గుర్తించలేదంది. ఒకవేళ ఎవరికైనా అయాచిత ప్రయోజనం కలిగినట్లు వెలుగులోకి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మరిన్ని వార్తలు