ఉగ్రబాధిత భారత్

20 Nov, 2015 04:15 IST|Sakshi

2014లో దేశంలో ఉగ్రదాడుల మృతుల సంఖ్య 416
 గ్లోబల్ టైజం ఇండెక్స్  తాజా నివేదిక వెల్లడి
 
 న్యూయార్క్: 2014లో ఉగ్రవాదంతో ప్రభావితమైన టాప్ 10 దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులతో సంభవిస్తున్న మృతుల్లో సగానికిపైగా ఐసిస్, బొకో హరమ్‌ల వల్లనే జరుగుతున్నట్లు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. గ్లోబల్ టైజం ఇండెక్స్-2015 మూడో ఎడిషన్ ప్రకారం మొత్తం 162 దేశాలు ఉగ్రవాదం బారిన పడగా, అందులో భారత్ ఆరో స్థానంలో ఉంది. పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉండగా, అమెరికా 35వ స్థానంలో నిలిచింది. భారత్‌లో 2014లో ఉగ్ర దాడుల మృతుల సంఖ్య 1.2 శాతం పెరిగి 416కు చేరింది. నివేదికలోని ముఖ్యాంశాలు:
 
2014లో భారత్‌లో లష్కరే తోయిబాతోపాటు, హిజ్బుల్ ముజాహిదీన్ అనే ప్రమాదకర ఉగ్రసంస్థలున్నాయి. పాక్‌కు చెందిన లష్కరే 24 మంది మృతికి, హిజ్బుల్ 11 మంది మృతికి కారణమయ్యాయి. ఇది గత ఏడాది (30) కన్నా తక్కువ.
 
2014లో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడుల మృతుల సంఖ్య 80 శాతానికి పైగా పెరిగి అత్యధికంగా 32,658కి చేరింది.
 
ఇస్లామిక్ స్టేట్స్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్‌కు చెందిన ఐఎస్‌ఐఎల్‌కు విధేయంగా ఉన్న బొకో హరమ్ ఉగ్రసంస్థ వల్ల 2014లో 6,644 మంది, ఐఎస్ దాడుల్లో 6,073 మంది చనిపోయారు.
 
2000-2014  కాలంలో టాప్ 10 దేశాల్లో భారత్ 14 సార్లు చోటు దక్కించుకుంది.
 
భారత్‌లో ఉగ్రవాద బృందాలను కమ్యూనిస్టులు, ఇస్లామిస్టులు, వేర్పాటువాదులు అని మూడు రకాలుగా వర్గీకరించింది.  ఎక్కువగా దాడులకు పాల్పడుతున్నది కమ్యూనిస్టు తీవ్రవాదులే. వీరి వల్లనే ఎక్కువ మరణాలు జరిగాయి. 2014లో 172 మంది మృతికి తామే కారణమని రెండు మావోయిస్టు గ్రూపులు ప్రకటించాయి. ఉగ్రవాదం వల్ల జరిగిన మృతుల్లో ఇది 41 శాతం.
 
మావోయిస్టులు ఎక్కువగా పోలీసులనే లక్ష్యంగా ఎంచుకున్నారు. వీరి దాడుల్లో మరణిస్తున్న వారిలో సగం మంది పోలీసులున్నారు. దేశంలో ఎక్కువగా బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో ఎక్కువగా మావో దాడులు జరిగాయి.
 
పాక్‌తో ఉన్న జమ్మూకశ్మీర్ వివాదమే దేశంలోని ఇస్లామిక్ ఉగ్రవాదానికి కారణం. దీనివల్ల దేశంలో 57 మంది మరణించారు. ఇది మొత్తం మృతుల సంఖ్యలో 14 శాతంగా ఉంది.
 
ప్రపంచవ్యాప్తంగా అఫ్ఘానిస్తాన్, ఇరాక్, నైజీరియా, పాకిస్తాన్, సిరియా అనే ఐదు దేశాల్లో ఉగ్రవాదం చాలా పటిష్టంగా ఉంది. 2014లో ఉగ్రదాడుల్లో 78 శాతం మరణాలు ఈ దేశాల్లోనే సంభవించాయి.
 
మొత్తమ్మీద ఉగ్రవాదంపై పోరాటానికి చేస్తున్న వ్యయం గత ఏడాదితో పోలిస్తే 61 శాతం పెరిగి 52.9 బిలియన్ డాలర్లకు చేరింది.
 
పాశ్చాత్య దేశాల్లో యువత నిరుద్యోగిత, డ్రగ్స్ నేరాలు లాంటి సామాజిక-ఆర్థిక పరమైన కారణాలు ఉగ్రవాదంవైపు నడిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు