జమ్ము కశ్మీర్‌ : ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం

16 Oct, 2019 08:29 IST|Sakshi

శ్రీనగర్‌ : దక్షిణ కశ్మీర్‌లోని పజాల్‌పుర ప్రాంతంలో ఓ ఇంటిలో తలదాచుకున్న ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరోవైపు ఆపరేషన్‌ కొనసాగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. సైన్యం, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టారు. గృహంలో పలువురు ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం. ఆ ఇంటి వద్ద ఉగ్రవాదుల కదలికలపై సైన్యానికి సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైన్యం శ్రమిస్తోంది. కాగా జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు సరిహద్దుల నుంచి చొరబాటు యత్నాలు పెరుగుతున్న క్రమంలో భద్రతా దళాలు ఎక్కడికక్కడ చొరబాటుదార్లను అడ్డుకుంటున్నాయి. ఉగ్రవాద దాడులను ప్రేరేపించేందుకు పాకిస్తాన్‌ చొరబాట్లను ప్రోత్సహిస్తోంది.

మరిన్ని వార్తలు