హోలీపండుగలో నీటిని వృధా చేయొద్దు!

16 Mar, 2016 15:11 IST|Sakshi

థానెః  ముంబై మెట్రోపాలిటన్ డివిజన్ లోని థానే ప్రజలు నీరు అనవసరంగా వృధా చేయవద్దని స్థానిక కలెక్టర్ అశ్విని జోషి పిలుపునిచ్చారు. భారత సంప్రదాయ పండుగల్లో ఒకటైన హోలీ పండుగ వస్తున్న నేపథ్యంలోఆమె ప్రజలకు నీటిని వృధా చేయవద్దని సూచించారు.

హోలీ పండుగ సందర్భంగా జనం వారంపాటు జరుపుకునే అనేక సంప్రదాయ కార్యక్రమాల్లో భాగంగా రైన్ డ్యాన్స్ లు వంటివి చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందని, అటువంటి వాటితో నీరు భారీగా వృధా అయ్యే అవకాశం ఉందని థానె కలెక్టర్ అశ్విని జోషి అన్నారు. జిల్లాలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, నీటి వృధాని అరికట్టడంలో భాగంగా జలపూజలు చేపట్టి జలజాగృతి కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు అవగాహన పెంచుకొని వృధాని అరికట్టాలని కోరారు.

ముఖ్యంగా స్థానిక హౌసింగ్ సొసైటీలు, గృహ సముదాయాలు వాటర్ హార్వెస్టింగ్, రైసైక్లింగ్ పథకాలను ఆచరణలో పెట్టి , నీటి నిల్వలు పెంచేందుకు తోడ్పడాలని, అటువంటి ప్రాజెక్టులను జిల్లా ప్లానింగ్ కమిటి ముందుంచాలని జోషి కోరారు.  జిల్లా షాపూర్ తాలూకాలోని ఆనకట్టలు, నదులు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని జోషి పేర్కొన్నారు. జిల్లాలోని ఆరు నదుల్లోని నీటితో కలెక్టర్ జలపూజ కార్యక్రమాన్ని చేపట్టి, దీంతోపాటు  జలరథ్ యాత్రను కూడ ప్రారంభించారు. యాత్రలో భాగంగా  అన్ని తాలూకాల్లో ప్రజలకు నీటివృధా అరికట్టడంతోపాటు, వాడకంలో జాగ్రత్తలపై  అవగాహన పెంచనున్నారు.

మరిన్ని వార్తలు