అపర సతీసావిత్రి

30 Jan, 2019 12:05 IST|Sakshi
మాలతి

మరణశిక్ష నుంచి భర్తను రక్షించుకున్న తంజావూరు మహిళ

అండగా నిలిచిన కేరళ ముస్లిం సంఘాలు

రూ.30 లక్షలు ఆర్థిక సహాయం చేసిన ఎన్‌ఆర్‌ఐలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్థికంగా కడుపేద అయితేనేం.. సమున్నతమైన మనసులో ఆమె ఎంతో ధనవంతురాలు. పొట్టికూటి కోసం దుబాయ్‌కి వెళ్లిన భర్త హత్య కేసులో జైలు పాలయ్యాడు. కోర్టు మరణదండన శిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది. తమిళనాడులో ఉన్న భార్య హృదయం తల్లడిల్లిపోయింది. అహర్నిశలు అలుపెరుగని కృషిచేసి అపర సతీ సావిత్రిలా ఉరికంబం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న భర్త ప్రాణాలను కాపాడుకుంది. మీడియా ద్వారామంగళవారం వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం తంజావూరుకు చెందిన అర్జున్‌ ఆదిముత్తు, మాలతి నిరుపేద దంపతులు. అర్జున్‌ దుబాయ్‌లో కూలీ పనిచేసేవాడు. దుబాయ్‌లో నివసించే కేరళ రాష్ట్రం మలప్పురానికి చెందిన అబ్దుల్‌వాజిత్‌ అనే అతనిని హత్య చేసిన కేసులో ఆదిముత్తును దుబాయ్‌ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ కేసు దుబాయ్‌ కోర్టులో విచారణ పూర్తికాగా అర్జున్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. భర్తకు దూరంగా తంజావూరులో అష్టకష్టాలు పడుతూ కాలం వెళ్లదీస్తున్న మాలతి ఈ సమాచారంతో హతాశురాలైంది. దుబాయ్‌ చట్టం ప్రకారం హతుని కుటుంబీకులు గనుక హంతకుడిని క్షమిస్తున్నట్లు ప్రకటిస్తే మరణదండన రద్దు అవుతుంది.

ఈ విషయం తెలుసుకున్న మాలతి మలప్పురంలోని ముస్లిం సంఘాలను సంప్రదించి మరణదండన నుంచి తన భర్త ప్రాణాలను కాపాడాలని చేతులు జోడించి వేడుకుంది. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న అక్కడి ముస్లిం సంఘాలు దుబాయ్‌లోని హతుని కుటుంబీకులతో చర్చలు జరిపారు. నష్టపరిహారంగా రూ.30 లక్షలు చెల్లించేలా ఇరుపక్షాల మధ్య సామరస్యపూర్వక ఒప్పందం కుదిరింది. అయితే మాలతి కడుపేద కావడంతో తనకు అంతటి స్థోమత లేదని ముస్లిం సంఘాలతో మొరపెట్టుకుంది. దీంతో కేరళ ప్రజలు, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ముందుకు వచ్చి మాలతికి స్నేహహస్తాన్ని అందించారు. విరాళాలు పోగేసి సేకరించిన రూ.30 లక్షలను దుబాయ్‌లోని హతుని కుటుంబీకులకు అందజేశారు. హంతకుడికి క్షమాభిక్ష పెట్టాల్సిందిగా హతుని కుటుంబీకులు లిఖితపూర్వకంగా తమ సమ్మతాన్ని తెలియజేశారు. ఈ ఉత్తరాన్ని కోర్టులో దాఖలు చేయగా దుబాయ్‌ కోర్టు హంతకుడు అర్జున్‌కు విధించిన మరణదండనను రద్దు చేసి శిక్ష తగ్గించింది. అంతేగాక ఫోన్‌ ద్వారా భార్య మాలతితో మాట్లాడుకునే అవకాశం కూడా కల్పించింది. తన భర్త ప్రాణాలను కాపాడేందుకు సహకరించిన కేరళ ప్రజలకు కృతజ్ఞతభావం నిండిన హృదయం, ఆనందంతో చెమర్చిన కళ్లతో ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు కేరళలోని ముస్లిం సంఘాలకు ఉత్తరం కూడా రాసింది. 

మరిన్ని వార్తలు