ఆ తరంగాలు గ్రహాంతరవాసులవేనా?

15 Mar, 2017 03:59 IST|Sakshi
ఆ తరంగాలు గ్రహాంతరవాసులవేనా?

సుదూర విశ్వం నుంచి భూమిని తాకుతున్న ఎఫ్‌ఆర్‌బీలు
వీటిపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు


గ్రహాంతరవాసులు ఉన్నారా? అత్యాధు నిక టెక్నాలజీ సాయంతో వారు అంతరిక్ష నౌకలనూ నడపగలుగుతున్నారా? దీనికి అవునంటున్నారు హార్వర్డ్‌ స్మిత్‌ సోనియన్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ శాస్త్రవేత్తలు. ఫాస్ట్‌ రేడియో బరస్ట్స్‌(ఎఫ్‌ఆర్‌బీ)లపై జరిపిన పరిశోధనలతో తామీ అంచనాకు వస్తున్నట్లు భారతీయ సంతతి శాస్త్రవేత్త మనస్వి లింగం అంటున్నారు.

సుదూర విశ్వం నుంచి..
మీకు రేడియో తరంగాల గురించి తెలుసుకదా.. సెల్‌ఫోన్లు మొదలుకుని.. మిలిటరీ కమ్యూనికేషన్స్‌ వరకూ అనేక చోట్ల వీటిని వాడుతుంటాం. వీటిల్లో కొన్ని తక్కువ శక్తి కలిగి ఉంటే.. ఇంకొన్ని అత్యధిక శక్తి కలిగి ఉంటాయి. వీటిని ఎలా సృష్టించాలో.. ఎలా ప్రసారం చేయాలో.. తీవ్రతను ఎలా ని యంత్రించాలో మనకు తెలుసు. కానీ.. ఎక్కడో సుదూర విశ్వం నుంచి అకస్మాత్తుగా అత్యంత శక్తివంతమైన రేడియో తరంగాలు భూమిని తాకాయనుకోండి. ఎలా ఉంటుంది?. అది కూడా కేవలం 5 మిల్లీ సెకన్ల పాటు మాత్రమే ఈ తరంగాలు ప్రసారమవుతూంటే? ఆసక్తికరంగా ఉంటుంది కదూ.. ఈ రకమైన ఎఫ్‌ఆర్‌బీను ఆస్ట్రేలియాలోని పార్క్స్‌ వేదశాల శాస్త్రవేత్తలు 2007లో తొలిసారి గుర్తించారు.

విశ్వం నుంచి వెలువడే అనేకానేక రకాల తరంగాల్లో ఇదీ ఒకటి కాబోలు అనుకున్నారు. అయితే 2007 తరువాత ఇప్పటివరకూ ఇలాంటి ఎఫ్‌ఆర్‌బీలు కొన్ని డజన్లు గుర్తించడంతో వీటిపై ఆసక్తి పెరిగింది. 2015లో మెక్‌గిల్‌ వర్సిటీ ఖగోళ శాస్త్రవేత్త ఇవన్నీ ఒకే దిక్కు నుంచి వస్తున్నట్లు గుర్తించడం.. గతేడాది ఇవన్నీ 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని పాలపుంత నుంచి వస్తున్నట్లు గుర్తించడంతో విషయం కొంచెం సీరియస్‌ అయింది.

ఎంతో దూరాన్ని దాటుకుని..
ఈ ఎఫ్‌ఆర్‌బీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సహజసిద్ధమైనవా? లేక ఎవరైనా సృష్టిస్తున్నారా? అన్న అంశాలను తెలుసుకునేందుకు అవి లోబ్, మనస్వీ లింగంల బృందం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్రహాంతర వాసులెవరో వీటిని సృష్టించేందుకు అవకాశాలు ఎక్కు వగా ఉన్నాయని వీరు ప్రతిపాదిస్తున్నారు. సౌర శక్తి ద్వారా భారీ సైజు ట్రాన్స్‌మిటర్ల (ఒక్కొక్కటీ గ్రహం సైజు)తో ఈ రేడియో తరంగాలను సృష్టిస్తున్నారని.. కాంతి వేగంతో ప్రయాణించే అంతరిక్ష నౌకలను నడిపించేందుకు వీటిని ఉపయోగిస్తూండవచ్చని అంటున్నారు. ‘‘ఈ వ్యవస్థలో 2 భాగాలున్నాయి. సోలార్‌ ప్యానె ల్స్‌ వంటి వాటితో శక్తిని భారీ స్థాయిలో సేకరించేది ఒకటైతే.. రేడియో తరంగాలను ప్రసారం చేసేది రెండోది.

ఈ తరంగాల సాయంతోనే లైట్‌ సెయిల్‌ వంటి అంతరిక్ష నౌకలు నడుస్తూంటాయి’’అని మనస్వి అంటున్నారు. కోట్ల దూరాన్ని దాటుకుని భూమిని చేరుతున్న ఎఫ్‌ఆర్‌బీల శక్తిని పరిశీలిస్తే ఆ రేడియో ట్రాన్స్‌మిటర్ల సైజు అంచనా వేయవచ్చని.. భూ మి వ్యాసార్థానికి రెట్టింపు సైజున్న ట్రాన్స్‌మిటర్లను వాడి ఉంటారంటున్నారు. అయితే.. ఎఫ్‌ఆర్‌బీలు గ్రహాంతరవాసుల సృష్టి అయ్యేందుకు అన్ని అవకాశాలున్నప్పటికీ ఇప్పటివరకూ పరిశీలించిన ఎఫ్‌ఆర్‌బీల సంఖ్య తక్కువ కాబట్టి అప్పు డే ఒక అంచనాకు రాలేమని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.     
    – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

>
మరిన్ని వార్తలు