కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఖాయం

14 May, 2014 00:31 IST|Sakshi
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఖాయం

బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ధీమా

 హైదరాబాద్: ఎగ్జిట్‌పోల్‌లు, సర్వేల్లో వెల్లడించిన స్థానాల కన్నా... బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లుగా దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్ దేశానికి సరైన నాయకత్వాన్ని అందించలేకపోయారని నాగం విమర్శించారు. బీజేపీ 10 నెలల క్రితమే సమర్థవంతమైన నేతను ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించిందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ 270కి పైగా, ఎన్డీయే కూటమి 300కు పైగా ఎంపీ స్థానాలు సాధించగలవన్న సంకేతాలు తమకు ఉన్నాయని చెప్పారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారని... అవినీతికి-నిజాయితీకి మధ్య జరిగిన పోరులో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిజాయితీ (బీజేపీ)కి ఓట్లేశారని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లే రాష్ట్రం ఏర్పాటైందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం కావడం వల్లే స్థానిక ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో రాణించలేక పోయామని నాగం చెప్పారు. బీజేపీ, టీడీపీ పొత్తుపై పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుందని.. ఈ పొత్తుతో ఇరు పార్టీలు లాభపడినట్లు భావిస్తున్నామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ఆశించిన స్థానాలు దక్కనప్పటికీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో గణనీయమైన స్థానాలకు గెల్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు