నదులు కలిసేనా.?

14 Sep, 2017 02:29 IST|Sakshi
నదులు కలిసేనా.?

► అనుసంధానంపై అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం
► మహానది–గోదావరి అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్న ఒడిశా
► తమ ప్రాంతాలు ప్రభావితమవుతాయని.. నీటి కొరత తప్పదని స్పష్టీకరణ
► గోదావరిలో మిగులు జలాలు లేవంటున్న తెలంగాణ
► ఇచ్చంపల్లి–సాగర్, ఇచ్చంపల్లి–పులిచింతలతో తెలంగాణలో 9 లక్షల హెక్టార్లకు నీరొస్తుందంటున్న కేంద్రం
► అనుసంధానం చేయనున్నమొత్తం నదులు60
► నదుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మొత్తం ఖర్చు (సుమారుగా)5.5 లక్షల కోట్లు


సాక్షి, హైదరాబాద్‌: నదుల అనుసంధానం.. ఒక నదిలో అధిక లభ్యతగా ఉన్న నీటిని మరో నదికి తరలించేందుకు ఏకంగా రూ.5.5 లక్షల కోట్లతో కేంద్రం చేపట్టిన ఈ బృహత్తర యజ్ఞం ఏ తీరాలకు చేరనుంది? అదనపు జలాల లభ్యతపై జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఏం చెబుతోంది? తెలంగాణ, ఒడిశా వైఖరులేంటి? వాటి వాదనలేంటి? నీటి లెక్కలపై ఏమంటున్నాయి? ‘సంధానం’పై సమగ్ర కథనం..

మొత్తం 60 నదులు..
లక్షల కోట్ల భారీ వ్యయంతో దేశంలోని 60 నదులను అనుసంధానించే కార్యక్రమా న్ని కేంద్రం వేగవంతం చేస్తోంది. ఇం దులో భాగంగా పెద్దఎత్తున డ్యామ్‌ లు, కాల్వల నెట్‌వర్క్‌ను నిర్మించాలని భావిస్తోంది. దీంతో రుతుపవనాలపై ఆధారపడాల్సిన అగత్యాన్ని తప్పించి, సాగునీటి వ్య వస్థకు ప్రాణం పోయవచ్చని అంచనా వేస్తోంది. తొలి ప్రాధా న్యం దక్షిణాదికే ఇస్తూ తెలంగాణ, ఒడిశాలతోనే చర్చలకు అంకురార్పణ చేస్తోంది. మహానది–గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధాన ప్రక్రియను మొదలు పెట్టింది.

మన దగ్గర ఎంత ఖర్చు?
ఒడిశాలోని మహానదిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణాలతో కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధానించాలన్నది కేంద్రం ప్రణాళిక. మహానదిలో సుమారు 360 టీఎంసీలలతో పాటు గోదావరిలో ఏపీ, తెలంగాణలకు ఉన్న 1,480 టీఎంసీల నీటి కేటాయింపులు పోనూ మరో 530 టీఎంసీల మిగులు జలాలున్నాయన్నది కేంద్రం లెక్క. వీటి వినియోగం కోసం తెలంగాణ పరిధిలోని ఇచ్చంపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్‌(కృష్ణా), ఇచ్చంపల్లి–పులిచిం తల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రణాళిక వేసింది. ఇందుకు 299 కిలోమీటర్ల పొడవైన ఇచ్చంపల్లి–సాగర్‌ అనుసంధాన ప్రక్రియకే రూ. 26,289 కోట్లు అవసరం అవుతాయని, ఇందులో ప్రధాన లింక్‌ కెనాల్‌కు రూ.14,636 కోట్లు అవసరమని లెక్కకట్టింది. ఇక 312 కిలోమీటర్ల పొడవైన ఇచ్చంపల్లి–పులిచింతలకు పూర్తి అంచనా తెలియకున్నా ప్రధాన కెనాల్‌కు రూ.4,252 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక అనుసంధాన కాల్వల వెంట రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాలతో 226 గ్రామా లు, లక్ష మంది జనం ప్రభావితం కానున్నారు. 51 వేల అటవీ, 70 వేల ఎకరాల వ్యవసాయ భూమి ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

రాష్ట్రంలో 9 లక్షల హెక్టార్లకు లబ్ధి!
ఇచ్చంపల్లి–పులిచింతల, ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులతో తెలంగాణలో 9 లక్షల హెక్టార్ల మేర అదనపు సాగు అందుబాటులోకి వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. గృహ, సాగునీటి అవసరాల నిమిత్తం మరో 15 టీఎంసీల మేర నీరు అందుబాటులోకి రావడంతో పాటు 1000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుందని గతంలో నిర్వహించిన సర్వే ఆధారంగా గుర్తించింది. ఇచ్చంపల్లి–సాగర్‌తో కరీంనగర్‌ జిల్లాలోని 2 మండలాలు, వరంగల్‌లోని 11, నల్లగొండ జిల్లాలోని 9 మండలాల్లోని 2.87 లక్షల హెక్టార్లకు సాగునీరు అందనుంది. అలాగే ఇచ్చంపల్లి–పులిచింతల తో వరంగల్‌లోని 2 మండలాలు, ఖమ్మంలోని 13, నల్లగొండలో 2, కరీంనగర్‌లో ఒక మం డల పరిధిలో 6.13 లక్షల హెక్టార్ల భూమికి నీరందనున్నట్లు అంచనా వేసింది. పదేళ్ల తర్వా త విద్యుత్, సాగు రూపేణా ఇచ్చంపల్లి–సాగర్‌ కింద ఏటా రూ.3 వేల కోట్లు, ఇచ్చంపల్లి–పులిచింతల కింద రూ.2201.67 కోట్ల మేర ప్రయోజనాలు దక్కుతాయని భావిస్తోంది.

మేం ఒప్పుకోం..: ఒడిశా
నదుల అనుసంధానానికి ఒడిశా అభ్యంతరం చెబుతోంది. మహానది–గోదావరి అనుసంధానంతో తమ పరీవాహక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని, భవిష్యత్‌లో తమకు నీటి కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తోంది. మహానదిలో 321.39 టీఎంసీల మేర మిగులు జలాలున్నాయన్న కేంద్రం లెక్కలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బార్ముల్‌ డ్యామ్‌ నుంచి 321.39 టీఎంసీల నీటిని మహానది నుంచి మళ్లిస్తే అందులో 141.6 టీఎంసీల నీటిని ఒడిశాలో 3.97 లక్షల హెక్టార్ల భూమిని సాగులోకి తేవచ్చని, విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉంటుందని కేంద్రం చెబుతోంది. మిగతా 180 టీఎంసీలను గోదావరికి మళ్లిస్తామని అంటోంది. ఈ వాదనకు ఒడిశా బ్రేక్‌లు వేస్తోంది. ఈ అనుసంధానంతో తమ ప్రాంతంలో 1,500లకు పైగా ప్రాంతాలు ప్రభావితమవుతాయని పేర్కొంటోంది. అదీగాక మహానదిలో 100 టీఎంసీలకు మించి మిగులు లేదని చెబుతోంది.

మిగులు జలాలెక్కడివి?
గోదావరిలో తెలంగాణకు హక్కుగా ఉన్న 954 టీఎంసీల్లో నిర్మితమైన, నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 684 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంటారని, మిగతా 270 టీఎంసీలు మిగులు జలాలేనని ఎన్‌డబ్ల్యూడీఏ చెబుతున్న లెక్కలను తెలంగాణ తప్పుపడుతోంది. తమ వాటా 954.2 టీఎంసీల వినియోగానికి తగ్గట్టుగా ప్రాజెక్టుల నిర్మాణ ప్రణాళికలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల కింద 433.04 టీఎంసీలు వినియోగంలో ఉండగా, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులతో 475.79 టీఎంసీలు, చేపట్టనున్న ప్రాజెక్టులతో మరో 45.38 టీఎంసీలను వినియోగంలోకి తెస్తామని స్పష్టంచేస్తోంది.

మా ప్రయోజనాలు కాపాడాకే..: తెలంగాణ
తమ ప్రయోజనాలు కాపాడాకే అను సంధాన ప్రక్రియ మొదలుపెట్టాలని తెలంగాణ కోరుతోంది. రాష్ట్ర ప్రాజెక్టులకు రావాల్సిన నీటిని పూర్తిగా కేటాయించాక అదనం గా ఉన్న జలాలను అనుసంధానం చేసి తర లిస్తే అభ్యంతరం లేదని చెబుతోంది. గోదావరిలో అదనపు జలాలు ఉన్నాయని కేంద్రం పదేపదే చెప్పడాన్ని తప్పుపడుతోంది. గోదావరిలో లభ్యతగా ఉన్న 954 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతాయని అంటోంది. 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనాన్ని పట్టుకొని గోదావరిలో అదనపు జలాలున్నాయనడం సరికాదంది. అదనపు జలాలపై తాజాగా అధ్యయనం చేసి నిర్ణయం చేయాలని, అలాకాకుండా గ్రావిటీ ద్వారా వచ్చే 500 టీఎంసీల అదనపు జలా ల్లో్ల కేవలం 40 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగతా 460 టీఎంసీల నీటిని కృష్ణా ద్వారా పెన్నాకు తరలించుకుపోతామంటే తాము అంగీకరించబోమని స్పష్టం చేస్తోంది.

ముందు మహానది–గోదావరి కలపాలి
మహానది–గోదావరి అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే గోదావరి–కృష్ణా అనుసంధానం చేపట్టాలి. నదుల ఇంటర్‌లింకింగ్‌తో పాటు ఇంట్రాలింకింగ్‌(అంతర్గత నదుల అనుసంధానం)కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లో నీళ్లు రాని పరిస్థితి ఉంటే గోదావరిలో మాత్రం పుష్కలంగా నీరుంది. ఈ స్థితిలో గోదావరి జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి తరలించేందుకు కేంద్రం సహకరిస్తే బాగుంటుంది.
 – మంత్రి  హరీశ్‌రావు





ఎన్నెన్నో ప్రశ్నలు..!     
► 20 ఏళ్ల కింద వేసిన మిగులు జలాల లెక్కలతో ప్రస్తుత అనుసంధానం ఎలా సాధ్యం? రాష్ట్రాలు తమ అవసరాలకు తగ్గట్టు ప్రాజెక్టుల డిజైన్‌లు, రీ డిజైన్‌ చేశాయి. వాటిని కేంద్రం పరిగణనలోకి తీసుకోదా?

► నదీ జలాలకు సంబంధించి కొన్నింటిపై ట్రిబ్యునల్‌ తీర్పులు వచ్చినా అమల్లోకి(అవార్డు) రాలేదు. కొన్నిచోట్ల ఇంకా విచారణలో ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల సుప్రీంలో కేసులున్నాయి. ఈ నేపథ్యంలో మిగులు జలాలని ఎలా
తేలుస్తారు?

► ఒక నదీ బేసిన్‌ నుంచి వేరే రాష్ట్ర పరిధిలోని నదికి నీటిని తరలించేందుకు ఆయా రాష్ట్రాలు ఎందుకు అంగీకరించాలి? వారికి చేకూరే ప్రయోజనంపై కేంద్రం ఇస్తున్న స్పష్టత ఏంటి?

► సుమారు రూ.5.5 లక్షల కోట్ల భారీ ఖర్చుతో నదుల అనుసంధానానికి సిద్ధమైన కేంద్రం.. రాష్ట్రాలు చేపట్టే భారీ ప్రాజెక్టులు ఎందుకు అంతే ఖర్చుతో రాష్ట్రాలు ప్రాజెక్టులు చేపడితే ఎందుకు అభ్యంతరం చెబుతోంది?

► గోదావరి నీటిని కృష్ణా బేసిన్లోని పట్టిసీమకు తరలించి నదుల అనుసంధానం అంటున్న ఏపీ.. ఎగువ రాష్ట్రాలు వా టాలడిగితే మాత్రం దిక్కులు చూస్తోంది. దీనిపై కేంద్రం వైఖరి ఏంటి?

► రాష్ట్రాలు చేపట్టే ప్రాజెక్టులకు భూసేకరణ చట్టం, పర్యావరణ, అటవీ అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్న కేంద్రం.. నదుల అనుసంధానానికి అనుమతులు ఎలా ఇస్తుంది?

► వృథాగా పోతున్న గోదావరి నీటిని కాళేశ్వరం ద్వారా కృష్ణా బేసిన్‌ ప్రాంతా లకు తరలిస్తుంటే అనుమతుల విష యంలో కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోంది?

మరిన్ని వార్తలు