తలపడలేకే సీబీఐని ఉసిగొల్పారు

14 Dec, 2014 03:05 IST|Sakshi
తలపడలేకే సీబీఐని ఉసిగొల్పారు
 • కేంద్ర ప్రభుత్వంపై మమతా బెనర్జీ ఫైర్
 • ‘సహారా స్కాం’ నిందితుడితో ఫొటో దిగిన మోదీనీ అరెస్ట్ చేస్తారా?
 • ఎవరి పరిధిలో వారుంటే మంచిది.. లేదంటే విపరిణామాలు తప్పవు
 • రాష్ట్ర మంత్రి మదన్‌మిత్రా అరెస్ట్‌కు నిరసనగా చేపట్టిన ర్యాలీలో దీదీ హెచ్చరిక
 • కోల్‌కతా/న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐని ఉసిగొల్పుతోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మండిపడ్డారు. ‘‘ఒక కేసుతో సంబంధాలు ఉన్నాయనేందుకు ఫొటోలే ఆధారమనుకుంటే సహరా స్కామ్‌కు సూత్రధారైన సుబ్రతోరాయ్‌తో ఫొటో దిగినందుకు ప్రధాని నరేంద్రమోదీని కూడా అరెస్టు చేస్తారా?’’ అని ఆమె ప్రశ్నించారు.

  సహారా కార్యాలయంపై దాడిచేసినప్పుడు దొరికి ఎర్ర డైరీలో పలువురు పెద్దల పేర్లున్నాయని, సుబ్రతోరాయ్‌తో మోదీ ఫొటోలు ఉన్నాయంటూ వాటిని చూపారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించి బెంగాల్ రవాణా, క్రీడాశాఖ మంత్రి మదన్‌మిత్రాను సీబీఐ అరెస్టు చేసినందుకు నిరసనగా మమత శనివారం కోల్‌కతా వీధుల్లో భారీ ర్యాలీ, ఆందోళన నిర్వహించారు.

  మధ్యాహ్నం ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు గోస్తోపాల్ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీలో పలువురు ప్రముఖ క్రీడాకారులు పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి మమత మాట్లాడుతూ.. శారదా చిట్‌ఫండ్ యజమానులతో పలువులు సీపీఎం నాయకులు కూడా ఫొటోలు దిగారని వారిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నవారు ఎవరి పరిధిలో వారుంటే మంచిదనీ, లేదంటే విపరిణామాలు చూడాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

  బెంగాల్ సంస్కృతి, క్రీడలపై దాడి జరుగుతోందని.. మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్‌లు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై క్రీడాకారులు ఆందోళన చేపట్టాలని, వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈస్ట్ బెంగాల్ క్లబ్ అధికారి దేబబ్రత సర్కార్, మోహన్ బగాన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ శృంజయ్ బోస్‌లను సీబీఐ అరెస్టు చేయడంతో పాటు వాటి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే.. మంత్రి అరెస్టుకు నిరసనగా తృణమూల్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు నిర్వహించాయి.

  నిరసనకారులు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. షాపులు మూసేయించారు. రోడ్లను దిగ్బంధించగా, కొన్నిచోట్ల రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది.   సీపీఎం కార్యకర్తలు, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాగా, మిత్రాను 4 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ అలీపూర్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆయన కస్టడీని కోరుతూ సీబీఐ శనివారం కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
   
  ఢిల్లీ నుంచి ఆదేశాలు: మదన్ మిత్రా

  ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలవల్లనే తనను అరెస్టు చేశారని మదన్‌మిత్రా ఆరోపించారు. కోర్టు వద్ద  మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణ సందర్భంగా అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పానని, సీబీఐ జాయింట్ డెరైక్టర్ రాజీవ్‌సింగ్ తనకు టీ కూడా ఇచ్చారని పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యాక ఇంటికి వెళ్లిపోవచ్చన్నారని చెప్పారు. అయితే తాను టీ తాగుతుండగా ఓ అధికారి లోపలకు వచ్చి తమకు ఢిల్లీనుంచి ఆదేశాలు వచ్చాయని, అరెస్టు చేస్తున్నామని చెప్పారని తెలిపారు. మరోపక్క.. ఈ స్కామ్‌ను పరిశోధించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు సీబీఐ కొత్త డెరైక్టర్ అనిల్‌కుమార్ సిన్హా తెలిపారు. ఇందుకోసం దేశంలోనే అత్యుత్తమమైన అధికారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. కేసుతో సంబంధమున్న ప్రతి ఒక్కరి వివరాలు త్వరలోనే బయటపెడతామని తెలిపారు.
   

మరిన్ని వార్తలు