రైతు ఆందోళనలు మరింత హింసాత్మకం

8 Jun, 2017 01:36 IST|Sakshi
రైతు ఆందోళనలు మరింత హింసాత్మకం
- మంద్‌సౌర్‌ నుంచి ఇతర జిల్లాలకు పాకిన నిరసనలు
- చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.కోటి పరిహారం 
 
మంద్‌సౌర్‌: మధ్యప్రదేశ్‌ బుధవారం కూడా రైతుల ఆందోళనలతో అట్టుడికింది. పరిస్థితులు మరింత హింసాత్మకంగా మారాయి. రైతుల నిరసనలు మంద్‌సౌర్‌ నుంచి దేవాస్, నీముచ్, ఉజ్జయిని, ధార్, ఖర్గోనే జిల్లాలకు కూడా పాకాయి. మిగిలిన రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంది. ఆందోళనల్లో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 1,110 మంది ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సిబ్బందిని మధ్యప్రదేశ్‌కు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను శాంతింపజేసే చర్యలను ప్రారంభించింది. మంగళవారం నాటి ఆందోళనల్లో ఐదుగురు రైతులు మృతిచెందగా, పోలీసులు జరిపిన కాల్పుల వల్లే వారు చనిపోయారని ఆరోపణలు ఉన్నాయి.

మంద్‌సౌర్‌ జిల్లాలో బుధవారం కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ రైతులు ఆందోళనలు చేపట్టి ఓ గోదాము, పలు దుకాణాలను తగులబెట్టారు. మౌ–నీముచ్‌ జాతీయ రహదారిని దిగ్బంధించారు. దేవాస్‌ జిల్లాలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసరడంతోపాటు నాలుగు బస్సులు, 8 ఇతర వాహనాలను తగులబెట్టారు. నీముచ్‌ జిల్లాలో పోలీస్‌ ఔట్‌పోస్ట్‌కు కూడా నిప్పు పెట్టారు. రైతులను శాంతింపజేసేందుకు ప్రభుత్వం మంగళవారం నాడు చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, ప్రభుత్వోద్యోగం ఇస్తామని ప్రకటించింది. గాయపడ్డ రైతులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామనీ, రుణ ఎగవేత దారులుగా ముద్రపడ్డ రైతులు అప్పును తీర్చుకునేందుకు పథకం తీసుకొస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం కిందకు దాదాపు 6 లక్షల మంది రైతులు వస్తారనీ, వారి మొత్తం అప్పుల విలువ రూ.6 వేల కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. 
మరిన్ని వార్తలు