మణిపూర్‌లో తొలి బీజేపీ ప్రభుత్వం

15 Mar, 2017 02:04 IST|Sakshi
మణిపూర్‌లో తొలి బీజేపీ ప్రభుత్వం

ఇంఫాల్‌: మణిపూర్‌ రాష్ట్రంలో తొలి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. తదుపరి సీఎంగాబీజేపీ శాసనసభాపక్ష నేత  బీరేన్‌ సింగ్‌ బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రమాణం చేయనున్నారు. నలుగురు ఎన్‌పీఎఫ్‌ ఎమ్మెల్యేలు మంగళవారం గవర్నర్‌ నజ్మా హెప్తుల్లాను కలిసి బీజేపీకి మద్దతు తెలియజేయడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సింగ్‌ను గవర్నర్‌ ఆహ్వానించారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా సింగ్‌ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 60 సీట్లున్న అసెంబ్లీలో 32 మంది సభ్యుల మద్దతు తమకు ఉందనీ, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరుతూ బీజేపీ ఆదివారం గవర్నర్‌ను కలిసింది.

ఆ సమయంలో బీజేపీకి చెందిన 21 మంది, ఎన్‌పీపీకి చెందిన నలుగురు, ఎల్జేపీ, టీఎంసీ, కాంగ్రెస్‌ల నుంచి ఒక్కో ఎమ్మెల్యే (మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు) మాత్రమే బీజేపీ వెంట ఉన్నారు. ఎన్‌పీఎఫ్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా తమకు ఉందని చెబుతూ బీజేపీ ఒక లేఖను గవర్నర్‌కు అందజేసింది. అలా కుదరదనీ, ఎన్‌పీఎఫ్‌ ఎమ్మెల్యేలు కూడా తన వద్దకు వచ్చి బీజేపీకి మద్దతిస్తున్నట్లు చెప్పాలని గవర్నర్‌ అన్నారు. ఎన్‌పీఎఫ్‌ ఎమ్మెల్యేలు మంగళవారం గవర్నర్‌ను కలవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మార్గం సుగమమైంది.

ఈ నెలలోనే జరిగిన మణిపూర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 28 సీట్లు గెలిచి ఏకైక అతి పెద్ద పార్టీగా నిలవగా, బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించడం తెలిసిందే. 28 స్థానాలు గెలుచుకుని తాము అతిపెద్ద పార్టీగా ఉన్నందున, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ముందు తమనే పిలవాల్సిందని కాంగ్రెస్‌ అంటోంది. దీనిపై నజ్మా హెప్తుల్లా స్పందిస్తూ బీజేపీకి తగినంత సంఖ్యాబలం ఉంది కాబట్టే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ‘నాకు నియమ నిబంధనలు తెలుసు. వాటినే నేను అనుసరించాను. వాళ్లు (కాంగ్రెస్‌) ఏం ఆరోపణలు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. బీజేపీకి 30 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుంది. ఇది మణిపూర్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. మణిపూర్‌కు ఇంకా చాలా అబివృద్ధి, ఉద్యోగాలు అవసరం. వాటికోసం రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలని నేను అనుకుంటున్నాను’అని ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు