బొగ్గు స్కాంలో తొలి తీర్పు

29 Mar, 2016 04:07 IST|Sakshi
బొగ్గు స్కాంలో తొలి తీర్పు

జేఐపీఎల్, ఆ సంస్థ ఇద్దరు డెరైక్టర్లను దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు
♦ నేరపూరిత ఉద్దేశంతో భారత ప్రభుత్వాన్ని మోసం చేశారని స్పష్టీకరణ
♦ ఈ నెల 31న శిక్షల ఖరారుకు సంబంధించిన వాదనలు
 
 న్యూఢిల్లీ: ఒకరకంగా యూపీఏ ప్రభుత్వ పతనానికి కారణమైన బొగ్గు కుంభకోణంలో తొలి తీర్పు వెలువడింది. మోసపూరితంగా, నేరపూరిత కుట్రతో, అక్రమంగా బొగ్గు క్షేత్రం కేటాయింపును పొందారని జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్(జేఐపీఎల్) సంస్థను, ఆ సంస్థ డెరైక్టర్లు ఆర్‌సీ రుంగ్తా, ఆర్‌ఎస్ రుంగ్తాలను సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం దోషులుగా తేల్చింది. తీర్పు వెలువరించే సమయంలో కోర్టుహాల్లోనే ఉన్న దోషులను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. శిక్షల ఖరారుకు సంబంధించిన వాదనలు వినేందుకు జడ్జి భరత్ పరాశర్ విచారణను మార్చి 31కి వాయిదా వేశారు.

జార్ఖండ్‌లోని ‘నార్త్ ధాతు కోల్ బ్లాక్’ను పొందేందుకు జేఐపీఎల్, ఆ సంస్థ డెరైక్టర్లు భారత ప్రభుత్వాన్ని మోసం చేసినట్లుగా రుజువైందని ప్రత్యేక కోర్టు జడ్జి భరత్ పరాశర్ తన 132 పేజీల తీర్పులో పేర్కొన్నారు. సెక్షన్ 420 సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద వారిపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను కోర్టు ఆమోదించింది. ఫోర్జరీ ఆరోపణల సెక్షన్లను మాత్రం మినహాయించింది. ‘నిందితులు ఉద్దేశపూర్వకంగా, నేరపూరిత కుట్రతో తప్పుడు పత్రాలను.. సంస్థ అర్హతలు, సామర్ధ్యాలకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి స్క్రీనింగ్ కమిటీని, బొగ్గుమంత్రిత్వ శాఖను తద్వారా భారత ప్రభుత్వాన్ని మోసం చేశారు.

తప్పు అని తెలిసీ, నిజాలుగా ఆ వివరాలను స్క్రీనింగ్ కమిటీ ముందుంచారు’ అని కోర్టు తేల్చిచెప్పింది. ‘నిందితులు తమ ముందుంచిన సమాచారాన్ని వాస్తవమని నమ్మడం వల్ల జేఐపీఎల్‌కు బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలంటూ స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఆ సిఫారసు ఆధారంగా బొగ్గు శాఖ జార్ఖండ్‌లోని ‘నార్త్ ధాతు కోల్ బ్లాక్’ను మరో మూడు సంస్థలతో పాటు జేఐపీఎల్‌కు కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా కోర్టు నమ్ముతోంద’ని న్యాయమూర్తి పేర్కొన్నారు. తాము సేకరించిన భూమికి సంబంధించిన వివరాలను కూడా నిందితులు సమయానుకూలంగా మార్చినట్లుగా తేలిందన్నారు.

భూ సేకరణకు సంబంధించిన ఒప్పంద పత్రం కూడా నకిలీదేనని గట్టి అనుమానాలున్నాయన్నారు. పరిమితంగా లభ్యమయ్యే సహజ వనరైన బొగ్గు విలువను దృష్టిలో పెట్టుకుని.. నిందితులు తమ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన బొగ్గును ఎక్కువగా చూపారన్నారు. తమ దరఖాస్తుకు అధిక ప్రాధాన్యం లభించేందుకు వారు అన్ని రకాలుగా ప్రయత్నించారన్నారు. ఈ కేసులో బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులను నిందితులుగా చేర్చకపోయినంత మాత్రాన, వీరి నేర తీవ్రత తగ్గదని స్పష్టం చేశారు. ఈ కేసు కాకుండా, బొగ్గు కుంభకోణానికి సంబంధించి సీబీఐ దర్యాప్తు చేసిన మరో 19 కేసులు, ఈడీ పరిథిలో ఉన్న మరో రెండు కేసులు ప్రస్తుతం ప్రత్యేక కోర్టు విచారణలో ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు