ఐదు రాష్ట్రాల ఎన్నికలు: తొలిదశ పోలింగ్ ప్రారంభం

4 Apr, 2016 07:26 IST|Sakshi

- అస్సాంలో 65, బెంగాల్లో 18 అసెంబ్లీ స్థానాల్లో ప్రారంభమైన పోలింగ్
- బెంగాల్‌లోని 13 స్థానాల్లో 4 గంటల వరకే
- కట్టుదిట్టమైన భద్రత నడుమ కొనసాగుతున్న ప్రక్రియ

 
 గువాహటి/కోల్‌కతా: ఐదురాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా సోమవారం అస్సాం, పశ్చిమబెంగాల్లో మొదటిదశ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. అస్సాంలో 65, బెంగాల్లో 18 అసెంబ్లీ స్థానాలకు ఉదయం ఏడు గంటలనుంచిఓటింగ్ జరుగుతోంది. బెంగాల్లో మావోయిస్టుల ప్రాబల్యమున్న పశ్చిమ మిడ్నాపూర్, పురులియా, బంకుర జిల్లాల్లోని 18 నియోజకవర్గాల్లో 133 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 13 నియోజకవర్గాల్ని మావో ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిన ఎన్నికల కమిషన్ ఈ మేరకు భారీ భద్రత ఏర్పాటు చేసింది. మావో ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. మిగతా 5 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకూ ఓటింగ్ కొనసాగుతుంది. పశ్చిమబెంగాల్లో ఆరు దశల్లో భాగంగా మొదటి దశలో ఏప్రిల్ 4, 11 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

 అస్సాంలో 40 వేలమందితో భారీభద్రత
 అస్సాంలోని 65 నియోజకవర్గాల నుంచి 539 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 95 లక్షల మందికి పైగా ప్రజలు ఓటుహక్కు వినియోగించుకుంటారు. మొత్తం 12,190 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేసిన ఈసీ, 48 వేల మంది సిబ్బందిని ఎన్నికల కోసం వినియోగిస్తోంది. 3,663 కేంద్రాల్ని అతి సున్నిత ప్రాంతాలుగా, 7,629 పోలింగ్ బూత్‌లను సున్నితంగా ఈసీ గుర్తించింది. 40 వేలమందితో భద్రతను కట్టుదిట్టంచేసింది. అస్సాం సీఎం తరుణ్‌గొగోయ్ టిటాబోర్ నుంచి పోటీలో ఉండగా, ప్రస్తుత స్పీకర్ ప్రణబ్ గొగోయ్ సిబ్‌సాగర్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి సరబానంద్ సోనోవాల్ మజులి నుంచి బరిలో ఉండగా, ఎంపీ కామఖ్య ప్రసాద్ టిటాబోర్ నుంచి సీఎం గొగోయ్‌పై పోటీచేస్తున్నారు.

మరిన్ని వార్తలు