లైబ్రరీలోకి అమ్మాయిలు రావొద్దు!

12 Nov, 2014 02:05 IST|Sakshi
లైబ్రరీలోకి అమ్మాయిలు రావొద్దు!

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వీసీ వివాదాస్పద వ్యాఖ్యలు
అమ్మాయిలొస్తే అబ్బాయిల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుందన్న వీసీ  
వెల్లువెత్తిన నిరసనలు; నివేదిక కోరిన కేంద్ర ప్రభుత్వం

 
అలీగఢ్: ‘అమ్మాయిలొస్తే.. అబ్బాయిల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుంది. అందువల్ల విశ్వవిద్యాలయ ప్రధాన గ్రంథాలయంలోకి విద్యార్థినులను అనుమతించడం కుదరదు’ అంటూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) వైస్ చాన్స్‌లర్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. షా వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో.. ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్న కేంద్రప్రభుత్వం వీసీ జమీరుద్దీన్ షా నుంచి వివరణ కోరింది. ‘మనకు స్వాతంత్య్రం లభించింది అంటే.. విద్య, రాజ్యాంగ హక్కులు అందరికీ సమానమేనని భావిస్తున్నాం. అయితే, మన మనోభావాలు దెబ్బతినే, మన కూతుళ్లు అవమానపడేలా కొన్ని ఘటనలు జరుగుతున్నాయి’  అని ఢిల్లీలో మౌలానా ఆజాద్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఏఎంయూ వీసీ నుంచి నివేదిక కోరామన్నారు.

విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జమీరుద్దీన్ షా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీకి చెందిన అండర్‌గ్రాడ్యుయేట్ అమ్మాయిలను ప్రధాన ‘మౌలానా ఆజాద్’ లైబ్రరీలోకి అనుమతించకపోవడంపై మాట్లాడుతూ.. ‘ఇది క్రమశిక్షణకు సంబంధించిన విషయం కాదు. మౌలానా ఆజాద్ లైబ్రరీలో తగినంత స్థలం లేదు. ఇప్పటికే అది నిండిపోయింది. అబ్బాయిలు కూర్చోడానికే స్థలం లభించడం లేదు’ అన్నారు. అయితే, తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మంగళవారం షా వివరణ ఇచ్చారు. పీజీ చదువుతున్న వారందరినీ వర్సిటీ లైబ్రరీలోకి అనుమతిస్తున్నామని, డిగ్రీ కోర్సుల్లో ఉన్న 2,500 మంది అమ్మాయిలను మాత్రం రానివ్వడం లేదని పేర్కొన్నారు. వారంతా ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నారని, అక్కడి లైబ్రరీనే వారు వినియోగించుకోవచ్చునని చెప్పారు. ‘యూనివర్సిటీలో దాదాపు 4 వేల మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులు ఉన్నారు. వారందరినీ అనుమతిస్తే లైబ్రరీలో స్థలం సరిపోదు. అందువల్లే వారిని అనుమతించడం లేదు. ఇవేమీ కొత్తగా విధించిన ఆంక్షలు కావు. 1960లో లైబ్రరీ ఏర్పాటైనప్పటి నుంచీ ఈ నిబంధన కొనసాగుతోంది. మహిళా సాధికారతకు మేం వ్యతిరేకం కాదు’ అని వివరించారు. లైబ్రరీలోకి తమను అనుమతించకపోవడంపై విద్యార్థినులు మండిపడుతున్నారు. కూర్చుని చదువుకునేందుకు అనుమతించకపోయినా.. కనీసం పుస్తకాలు తెచ్చుకునేందుకైనా అనుమతించాలని కోరుతున్నారు.
 ఇది షాకింగ్..: కాగా, ఏఎంయూ వీసీ వ్యాఖ్యలను కేంద్రంలోని మైనారిటీ వర్గానికి చెందిన మంత్రులు నజ్మా హెప్తుల్లా, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా తప్పుబట్టారు.

వీసీ వ్యాఖ్యలు షాకింగ్‌గా ఉన్నాయని నజ్మా హెప్తుల్లా, నాగరిక సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదనీయం కాదని నఖ్వీ పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించకుండా, లైబ్రరీని వినియోగించరాదంటూ కొందరిపై నిషేధం విధించడం సరికాదని సామాజికన్యాయ శాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ అన్నారు. యూనివర్సిటీ అధికారుల మహిళా వ్యతిరేక మనస్తత్వానికి ఈ వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయని మరోమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యానించారు. ఈ వివక్షను తక్షణమే ఆపాలంటూ జాతీయ మహిళా కమిషన్ అభిప్రాయపడింది. హుందాగా ఉండే, సరైన దుస్తులనే ధరించాలని, ఒకటి కన్నా ఎక్కువ మొబైల్ ఫోన్లు వాడరాదంటూ విద్యార్థినులకు నిబంధనలు విధించి గతంలోనూ ఈ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం గమనార్హం.
 
 

మరిన్ని వార్తలు