లంచం ఇస్తేనే..

28 Jul, 2017 03:30 IST|Sakshi
లంచం ఇస్తేనే..

కాంట్రాక్టు పనులకు రూ.12 కోట్ల ముడుపులు
మంత్రిపై కోర్టులో పిటిషన్‌

రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ దెబ్బతినిందని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. అన్ని శాఖల్లో అవినీతి పేరుకుపోయిందని ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ చేసిన ఆరోపణలు నిత్యసత్యాలని భావించే సంఘటన కోర్టు పిటిషన్‌తో వెలుగు చూసింది. ఉన్నత విద్యాశాఖ మంత్రి అన్బగళన్‌ రూ.12 కోట్లు లంచం అడిగినట్లు కృష్ణగిరి జిల్లాకు చెందిన వెంకన్‌ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై : భవన నిర్మాణ కాంట్రాక్టు ఇచ్చేందుకు ఓ మంత్రి లంచం కోరారనే ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. తమిళనాడు ప్రజాపనుల శాఖలో ఫస్ట్‌క్లాస్‌ కాంట్రాక్టరుగా ఉన్న వెంకన్‌కు అనేక పనులను చేపట్టిన అనుభవం ఉంది. తేనీ, మదురై, వేలూరు, విళుపురం, కృష్ణగిరి, పుదుక్కోట్టై, అరియలూరు, తిరుచ్చిరాపల్లి జిల్లాల్లో కొత్తగా పాలిటెక్నిక్‌ కళాశాలల నిర్మాణానికి టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రజాపనులశాఖ ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా మే నెలలో వెలువడిన ఈ టెండర్‌కు వెంకన్‌ జూన్‌ 9వ తేదీన నామినేషన్‌ వేశాడు. ఈ టెండర్లలో వెంకన్‌ వేసిన నామినేషన్‌ ఆమోదం పొందింది.

అయితే  టెండర్‌ మూలంగా పనులను అప్పగించే ముందు ఉన్నత విద్యాశాఖా మంత్రి అన్బగళన్‌ను సంప్రదించాల్సిందిగా ఇంజినీరింగ్‌ అధికారులు అతడిని సూచించారు. సదరు పనులను ఈరోడ్‌కు చెందిన నందిని కన్‌స్ట్రక్షన్‌కు అప్పగించినందున టెండర్‌ డాక్యుమెంట్లను వాపసు తీసుకోవాల్సిందిగా వెంకన్‌కు మంత్రి సూచించారు. ఈ పనులు కావాలంటే మొత్తం సొమ్ములో 20 శాతం లంచంగా ఇవ్వాలని మంత్రి బేరం పెట్టారు. లంచం ఇవ్వని పక్షంలో టెండర్‌ను రద్దుచేస్తామని మంత్రి బెదిరించారు. లంచం ఇచ్చేందుకు మనస్కరించని వెంకన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు  చేశాడు.

ఈ పిటిషన్‌ న్యాయమూర్తి దురైస్వామి ముందుకు గురువారం విచారణకు వచ్చింది. రూ.79 కోట్ల కాంట్రాక్టు పనులకు 16 శాతం చొప్పున రూ.12 కోట్లు మంత్రి లంచం కోరారని, తాను నిరాకరించడంతో టెండరును రద్దు చేసేందుకు మంత్రి, అధికారులు సిద్ధం అవుతున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ పిటిషన్‌పై రెండు వారాల్లోగా బదులివ్వాలని మంత్రి అన్బగళన్, ప్రజాపనులశాఖ చీఫ్‌ ఇంజనీర్‌లకు న్యాయమూర్తి దురైస్వామి నోటీసులు జారీచేశారు. అవినీతి ప్రభుత్వమంటూ విమర్శలు చేసిన కమల్‌హాసన్‌పై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించిన మంత్రులు ఈ పిటిషన్‌పై ఏమంటారో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు