హెచ్‌ఎఫ్‌సీలపై చారిత్రక ఒప్పందం

16 Oct, 2016 01:01 IST|Sakshi

భారత్ సహా 200 దేశాల అంగీకారం

 కిగాలి(రువాండా): పర్యావరణానికి పెను ముప్పుగా మారిన హైడ్రోఫ్లోరోకార్బన్(హెచ్‌ఎఫ్‌సీ)ల వాడకాన్ని గణనీయంగా తగ్గించేందుకు భారత్ సహా 200 దేశాలు అంగీకరించాయి. సుదీర్ఘ చర్చల తర్వాత చారిత్రక ఒప్పందానికి అంగీకారం కుదిరింది.  సాధారణంగా వెలువడే కార్బన్ డయాక్సైడ్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా భూతాపానికి కారణమయ్యేవే ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్. వీటిని ఎక్కువగా రిఫ్రిజిరేటర్లు, ఏసీల్లో ఉపయోగిస్తుంటారు. 

రువాండా రాజధాని కిగిలిలో జరిగిన భేటీలో.. చట్టబద్ధత ఉన్న మాంట్రియల్ ప్రొటోకాల్‌కు సవరణలు చేసే అంశంపై విధానకర్తలు  చర్చలు జరిపారు. సవరణకు 197 దేశాలు అంగీకరించాయి. ఈ శతాబ్ది చివరి నాటికి ఓజోన్ పొరను కాపాడేందుకు గ్లోబల్ టెంపరేచర్‌ను 0.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించాలని, ఓజోన్ పొర రక్షణ చర్యలు కొనసాగించాలని నిర్ణయించారు. సవరణ ప్రకారం.. తొలుత వర్ధమాన దేశాలు హెచ్‌ఎఫ్‌సీల వాడకాన్ని తగ్గించాలి. తర్వాత చైనా, భారత్ తదితర 9 దేశాలు అనుసరించాలి. 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఎఫ్‌సీల వినియోగాన్ని 85% తగ్గించాలనేది ఈ సవరణ ఉద్దేశం.

మరిన్ని వార్తలు