ఆహార సబ్సిడీకీ నగదు బదిలీ

22 Jan, 2015 02:33 IST|Sakshi
ఆహార సబ్సిడీకీ నగదు బదిలీ

తొలుత 52 నగరాల్లో అమలు  ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులు
 
ఆంధ్రప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లను రాష్ట్రాలకే వదిలేయాలి

 
న్యూఢిల్లీ: ఇప్పటికే చమురు సబ్సిడీలను కత్తిరించి ఆ ప్రదేశంలో నగదు బదిలీని అమలు చేస్తుండగా.. ఇక ఆహార సబ్సిడీ స్థానంలో కూడా లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ ప్రవేశపెట్టాలని.. ఉన్నతస్థాయి కమిటీ సూచించింది. తొలుత వచ్చే రెండేళ్లలో దేశంలో పది లక్షలు, అంతకుమించి జనాభా గల 52 నగరాల్లో ఆహార సబ్సిడీకి నగదు బదిలీని అమలు చేయాలని సిఫారసు చేసింది. అలాగే.. ఆహార ధాన్యాల సేకరణ, పంపిణీ బాధ్యతలను నిర్వర్తించే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఇకపై తూర్పు రాష్ట్రాల మీద దృష్టి కేంద్రీకరించాలని..ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలోభారీ ధాన్యం కొనుగోళ్లను ఆయా రాష్ట్రాలకే విడిచిపెట్టాలని కూడా ఆ కమిటీ సూచించింది. ఎఫ్‌సీఐ విధులను సంపూర్ణంగా పునర్‌వ్యవస్థీకరించే అంశంపై సిఫారసులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో బీజేపీ ఎంపీ శాంతకుమార్ నేతృత్వంలో 8 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఈ కమిటీ తన నివేదికను బుధవారం నాడు ప్రధానమంత్రికి సమర్పించింది. ఆహార ధాన్యాల నిల్వ అంశాన్ని ఔట్‌సోర్సింగ్ ద్వారా ప్రయివేటు సంస్థలకు, కేంద్ర గిడ్డం గుల సంస్థ వంటి ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని కూడా ఈ కమిటీ నివేదికలో సూచించింది. గోధుమలు, బియ్యంపై రాష్ట్రాలు భారీగా పన్నులు విధిస్తున్న నేపధ్యంలో.. ఏకరూపంగా 3నుంచి 4 శాతం పన్ను విధించాలంది. నివేదికను నిర్ణీత కాలావధితో అమలు చేసేలా ఇందులోని అంశాలపై అభిప్రాయాలను తెలపాలని ఆహార, ప్రజా పంపిణీ విభాగానికి ప్రధాని సూచించారని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.
 

మరిన్ని వార్తలు