వినాయకిని మరచిపోతున్నారా?

1 Sep, 2017 17:17 IST|Sakshi
సాక్షి, న్యూఢిల్లీ: కాల గమనంలో స్త్రీ శక్తి స్వరూపిణి వినాయకిని పూర్తిగా మరచిపోతున్నారు. వినాయకుడికి స్త్రీ రూపం ఉందన్న విషయాన్ని కూడా తెలియనివారు ఎంతో మంది ఉన్నారంటే నేడు ఆశ్చర్యపోనక్కర్లేదు. హిందూ పురాణాల్లోనే వినాయకి ప్రస్థావన తక్కువగా ఉన్నప్పటికీ  వినాయక స్త్రీ రూపానికి అనేక పేర్లు ఉన్నాయి.
 
ప్రముఖ పరిశోధకుడు బాలాజ్‌ ముండుకుర్‌ రాసిన ‘ది ఎనిగ్మా ఆఫ్‌ వైనాయకీ’ పుస్తకం ప్రకారం వినాయకికి వైనాయకి, గణేషిని, గజానిని, విఘ్నేషిని, శ్రీ ఐనింగిని, గజరూప అని పేర్లున్నాయి. హిందూ కాలెండర్‌ ప్రకారం భాద్రపద నెలలో వినాయకుడి పుట్టిన రోజు వస్తుంది. సహజంగా ఆగస్టు నెల చివరలో వచ్చే వినాయకుడి పుట్టిన రోజునాడు ఆయనకు ఘనంగా పూజలు నిర్వహించడం వల్ల అన్ని విఘ్నాలు తొలగిపోతాయన్నది హిందువుల విశ్వాసం. 
 
విఘ్నాలు తొలగిపోవడానికి స్త్రీ రూపాన్ని పూజించినట్లు పురాణాధారాలు ఏమీ లేవుగానీ ప్రతి నెలలో వచ్చే నెలవంక నాలుగో రోజున ‘వినాయకి చతుర్థి’ పేరిట మహిళలు ప్రత్యేక పూజలు చేసేవారనడానికి ఆధారాలు ఉన్నాయి. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తనుమాలయన్‌ ఆలయంలో వినాయకి విగ్రహాలు ఇప్పటికీ స్పష్టంగానే ఉన్నాయి. ఇందులో ఓ విగ్రహం సుకాసనంలో కూర్చొని ఉన్నది.
 
నాలుగు చేతులుండే ఈ విగ్రహంలో పై ఎడమ చేతిలో గొడ్డలి, కింది ఎడమ చేతిలో శంఖం పట్టుకొని ఉంది. అలాగే కుడివైపున పై చేతిలో కలశం, మరో చేతిలో దండం ఉంది. ఆ పక్కనే మరో విగ్రహంలో వినాయకి నిలబడి ఉంది. దానికి రెండు చేతులే ఉన్నప్పటికీ విరిగిపోయి ఉన్నాయి. 1300 ఏళ్ల క్రితం నాటి ఈ ఆలయంలో వినాయకి విగ్రహాలకు ప్రత్యేకతలు ఉన్నాయని రిటైర్డ్‌ పురాతత్వ శాస్త్రవేత్త సి. శాంతలింగమ్‌ చెప్పారు. 
 
ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఈశాన్యంలో ఈ వినాయకి విగ్రహాలు కనిపిస్తాయని, మరే ఆలయంలో ఈశాన్య దిశన ఇలా విగ్రహాలు ఉండవని ఆయన వివరించారు. క్రీస్తుశకం 550లో రాసిన మత్స్యపురాణంలో కూడా వినాయకి ప్రస్తావన ఉంది. శివుడి అవతారంగా పేర్కొన్న 200 మంది దేవతల పేర్లలో వినాయకి పేరును పేర్కొన్నారు. హిందూ పురాణాలపై పలు పుస్తకాలు రాసిన దేవ్‌దత్‌ పట్నాయక్‌ కూడా వినాయకి ప్రస్థావన తీసుకొచ్చారు. 
 
ఆయన కథనం ప్రకారం అంధక అనే రాక్షసుడు పార్వతిని మోహించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ విషయాన్ని పార్వతి శంకరుడికి ఫిర్యాదు చేయడంతో ఆ రాక్షసుడిని శివుడు చంపాలనుకుంటాడు. అయితే ఆ రాక్షుసుడి ఒక్క రక్తం చుక్క కూడా నేల రాలకూడదు. అలా రాలిన చుక్కల నుంచి మళ్లీ ప్రాణం పోసుకునే వరం ఆ రాక్షసుడికి ఉంది. అందుకని పార్వతి విష్ణుమూర్తి శక్తి అయిన వైష్ణవి, బ్రహ్మ శక్తయిన బ్రాహ్మణి, ఇంద్రుడి శక్తయినా ఇంద్రానితోపాటు వినాయకిని సహాయం చేయాల్సిందిగా ప్రార్థిస్తుంది. అప్పుడు వీరందరు ఆ రాక్షసుడి రక్తాన్ని నేల రాలకుండానే గాల్లో ఉండగానే తాగేస్తారు. 
 
రాజస్థాన్‌లోని రైరా, ఒడిశాలోని హిరాపూర్, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌ దగ్గర భారాఘాట్‌ వద్ద ఇప్పటికీ వినాయకి విగ్రహాలు ఉన్నాయి. ముందుగా జానకి శ్రీనివాసన్‌ వినాయకి విగ్రహాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, వాటిని అనేక మంది షేర్‌ చేసుకోవడంతోపాటు తమ ప్రాంతాల్లోని ఆలయాల్లో ఇప్పటికీ ఉన్న వినాయకి విగ్రహాలను వెతికిపట్టుకొని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఈ కొత్త శోధనలో మరెన్ని వినాయకి విగ్రహాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. 
 
మరిన్ని వార్తలు