రూ.40 పలుకుతున్న కిలో ఉల్లి ధర

22 Jul, 2013 06:07 IST|Sakshi
రూ.30 నుంచి రూ.40 వరకు పలుకుతున్న కిలో ఉల్లి ధర

- రాష్ట్రంలోనూ ఘాటెక్కిన రేట్లు..

ఇంటింటా వినియోగించే ఉల్లిపాయల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో కళ్లు తెరిచిన కేంద్రసర్కారు ధరలకు కళ్లెం వేయడంపై దృష్టిపెట్టింది. దేశీయ సరఫరాను మెరుగుపరచడం, ధరలను అదుపులో ఉంచడం లక్ష్యంగా ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించేందుకు సమాయత్తమవుతోంది.

ఈ విషయాన్ని ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. ఉల్లి ధరలను నియంత్రణలో ఉంచడానికి ఎగుమతులపై నిషేధం విధించడంతోపాటు వివిధ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ఉల్లిపాయలు అత్యధికంగా పండే మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురియడంతో సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అనేక మార్కెట్లలో గడచిన కొద్దివారాలుగా ఉల్లి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లిపాయల ధర రిటైల్‌గా రూ.30 నుంచి రూ.40 పలుకుతోంది.

ఇక ఆసియాలోనే అత్యంత పెద్దదైన ఉల్లి మార్కెట్‌గా పేరుపొందిన మహారాష్ట్రలోని లాసల్‌గావ్‌లో హోల్‌సేల్ ధర కిలో రూ.25గా ఉంది. ఈ పరిస్థితుల్లో ధరల నియంత్రణకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించడం మినహా మరో ప్రత్యామ్నాయం ప్రభుత్వం వద్ద లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఉత్తరాది రకం ఉల్లిపాయల సరఫరా దాదాపుగా నిలిచిపోయి.. పాత నిల్వలతోనే నెట్టుకొస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం వచ్చే నెలాఖరు వరకు ఉల్లి ధరలపై ఒత్తిడి కొనసాగే అవకాశముందని నాసిక్‌కు చెందిన జాతీయ ఉద్యాన పరిశోధన, అభివృద్ధి ఫౌండేషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌డీఎఫ్)కు చెందిన అధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్‌ల నుంచి కొత్త పంట వచ్చే అక్టోబర్ నుంచి మార్కెట్‌కు వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో...
రాష్ట్రంలోనూ ఉల్లి ధరలు ఘాటెక్కాయి. నెల రోజుల్లో ఉల్లిపాయల ధర రెట్టింపైంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో ఉల్లి ప్రస్తుతం రూ. 36 పలుకుతోంది. రైతు బజార్లలో కిలో రూ.30, రోడ్డుపై కూరగాయలు విక్రయించే వ్యాపారులు రూ.35కు అమ్ముతున్నారు. షాపింగ్ మాల్స్‌లో రూ.36 నుంచి రూ.38 వరకూ ధర పలుకుతోంది. రాష్ట్రంలోని చాలా నగరాలు, పట్టణాల్లో కిలో ఉల్లిగడ్డల ధర రూ.34 నుంచి రూ.38 వరకూ ఉంది.

మరిన్ని వార్తలు