‘యూపీ విధ్వంసానికే యువరాజులు’

3 Feb, 2017 15:15 IST|Sakshi

మీరట్‌: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం కుమారుడు సీఎం అఖిలేశ్‌పై విమర్శల దాడి ఎక్కుపెట్టారు. ఈ ఇద్దరు యువరాజులు ఉత్తరప్రదేశ్‌ను ధ్వంసం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. గతంలో ఒకరు దేశాన్ని దోచేశారని(కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ), మరొకరు రాష్ట్రాన్ని దోచేశారని (ఎస్పీని ఉద్దేశిస్తూ) ఆ పార్టీలకు చెందిన వీరిద్దరు(రాహుల్‌, అఖిలేశ్‌) ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌పై పడ్డారని, ఈ ఒక్కసారి మాత్రం వారిని పక్కకు పెట్టేసి బీజేపీకి అధికారం అప్పగించాలని ఆయన యూపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీరట్‌లో రెండు కిలో మీటర్ల పొడవునా సాగిన రోడ్‌ షోలో అమిత్‌షా మాట్లాడారు.

మరోపక్క, ఈ రోజే ఎస్పీ, కాంగ్రెస్‌ కూటమి ఆగ్రా నుంచి 240 కిలోమీటర్ల మేర రోడ్‌షో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్‌షా స్వల్పవ్యవధిలో మాట్లాడుతూ అటు ఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీలతోపాటు బీఎస్పీపై మాటల దాడికి దిగారు. ‘సీఎం అఖిలేశ్‌, ఆయన కూటమి ఉత్తరప్రదేశ్‌లో నెలకొన్న అశాంతి పరిస్థితులకు సమాధానం చెప్పాలి. వారేం యూపీని అభివృద్ధి పథాన తీసుకెళ్లేందుకు ముందుకెళ్లడం లేదు. ఇప్పటి వరకు దేశాన్ని లూటీ చేశారు.. ఇప్పుడు యూపీపై పడ్డారు. ఇంకా చెప్పాలంటే వారు యూపీని ధ్వంసం చేయాలనుకుంటున్నారు’ అని అమిత్‌షా ఆరోపించారు. ఈసారి సైకిల్‌ను బద్ధలు కొట్టేయాలని, బీఎస్పీ నుంచి యూపీని కాపాడాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు